Maoist: పోగొట్టుకున్న డబ్బులు రాబట్టుకునేందుకు.. మావోయిస్టు పేరుతో ఆర్మీ జవాను దందా!

  • విజయనగరం జిల్లాలో ఘటన
  • మావోయిస్టు కమాండర్‌నంటూ బెదిరింపులు
  • వ్యాపారి నుంచి రూ.5 కోట్ల డిమాండ్
Army Jawan caught by police for acting as a maoist

భూ లావాదేవీల వ్యవహారంలో పోగొట్టుకున్న సుమారు రూ. 22 లక్షలను తిరిగి సంపాదించుకునేందుకు ఓ ఆర్మీ జవాను మావోయిస్టు అవతారం ఎత్తాడు. ఓ వ్యాపారి నుంచి రూ. 5 కోట్లు డిమాండ్ చేసి పోలీసులకు చిక్కాడు. విజయనగరం జిల్లాలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. పార్వతీపురం మండలం చినబంటువానివలసకు చెందిన చందనాపల్లి రాజేశ్వరరావు ఉత్తరప్రదేశ్‌లో ఆర్మీ జవానుగా పనిచేస్తున్నాడు. ఇటీవల 45 రోజుల సెలవుపై గ్రామానికి వచ్చాడు. వస్తూవస్తూ ఉత్తరప్రదేశ్‌లో రూ. 30 వేలకు ఓ తుపాకి కొన్నాడు.

గతంలో తాను నష్టపోయిన డబ్బులు తిరిగి సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో మావోయిస్టు అవతారం ఎత్తాడు. ఈ నెల 6న బంగారం వ్యాపారి బాబు ఇంటికి వెళ్లి ఆయనను బెదిరించాడు. గాల్లోకి మూడురౌండ్ల కాల్పులు జరిపి వెళ్లిపోయాడు. తర్వాతి రోజు ఫోన్ చేసి తనను తాను మావోయిస్టు కమాండర్‌గా చెప్పుకున్నాడు. రూ. 5 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన వ్యాపారి తాను కోటిన్నర మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. దీంతో ఆ సొమ్ము తీసుకుని పలానా చోటుకి రావాలని చెప్పాడు.

సరేనన్న బంగారం వ్యాపారి విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. పోలీసులు ఆయనకు నకిలీ నోట్లు ఇచ్చి నిందితుడు రమ్మన్న కొండల ప్రాంతానికి పంపించారు. వారు కూడా అక్కడే రహస్యంగా మాటు వేశారు. నిందితుడు రాజేశ్వరరావు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News