Maharastra: పరమ్‌వీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి.. విచారణ జరిపించాలని థాకరేను కోరిన పవార్‌

  • రాజకీయ దుమారానికి దారితీసిన అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసు
  • పరమ్‌వీర్‌ సింగ్‌ కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్న పవార్‌
  • ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందన్న ఎన్సీపీ అధినేత
  • అనిల్‌ దేశ్‌ముఖ్‌ హోంమంత్రిగా కొనసాగడంపై సీఎందే నిర్ణయం
Allegations made by Paramvir singh are serious pawar request cm for inquiry

ముకేశ్‌ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసుల మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసు నేపథ్యంలో వేటుకు గురైన ముంబయి మాజీ పోలీస్‌ కమిషన్‌ పరమ్‌వీర్‌ సింగ్‌.. ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. దీనిపై ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పందించారు.

అనిల్‌ దేశ్‌ముఖ్‌పై చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని.. వెంటనే దీనిపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేను పవార్‌ కోరారు. పోలీసు విభాగంలో రాజకీయ జోక్యం ఎక్కువవుతోందని పరమ్‌వీర్‌ తనకు గతంలోనే చెప్పినట్లు పవార్‌ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ఐపీఎస్‌ అధికారి జులియో రిబేరో నేతృత్వంలో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి సూచించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పోలీసు అధికారి సచిన్‌ వాజేను పరమ్‌వీర్‌ సింగే నియమించారని పవార్‌ తెలిపారు. ముంబయి పోలీస్‌ కమిషనర్‌గా తొలిగించిన నేపథ్యంలోనే ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్‌-ఎన్‌సీపీ కూటమి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అయితే, అవన్నీ ఫలించవని ధీమా వ్యక్తం చేశారు.  

ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను మంత్రివర్గంలో కొనసాగించడంపై ముఖ్యమంత్రి థాకరేనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

More Telugu News