Harish Rao: మంత్రి హరీశ్ రావు చొరవ... సానుకూలంగా స్పందించిన కేసీఆర్... వేలాది ఎకరాలకు నీళ్లు

  • గజ్వేల్ లో హరీశ్ రావు పర్యటన
  • నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయన్న రైతులు
  • క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి ఎద్దడిని గుర్తించిన హరీశ్
  • అక్కడిక్కడే సీఎం కేసీఆర్ కు ఫోన్
  • వెంటనే నీళ్లు ఇవ్వాలన్న సీఎం కేసీఆర్
 Harish Rao solves farmers problem with a phone call to CM KCR

తెలంగాణలో క్రమంగా వేసవి ఉష్ణోగ్రతలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, మంత్రి హరీశ్ రావు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయని మొరపెట్టుకున్నారు. కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని ఆయనకు విన్నవించారు. రైతుల సమస్యపై వెంటనే స్పందించిన హరీశ్ రావు రైతుల పంటల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. మల్లన్న సాగర్-కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ మధ్యలో ఉన్న సప్లై చానల్ నుంచి కూడవల్లి వాగులోకి నీటిని వదిలితే రైతుల పంటలకు నీళ్లు అందుతాయని గుర్తించారు.

దాంతో హరీశ్ రావు అప్పటికప్పుడు ఫోన్ ద్వారా సీఎం కేసీఆర్ ను సంప్రదించారు. రైతులు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి సమస్యను, అందుకు పరిష్కారాన్ని సీఎం కేసీఆర్ కు వివరించారు. హరీశ్ రావు ప్రతిపాదనకు సీఎం వెంటనే అంగీకారం తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీటి సమస్య తీర్చాలని హరీశ్ రావుకు స్పష్టం చేశారు. దాంతో రైతుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. అక్కడిక్కడే తమ సమస్యకు పరిష్కారం చూపిన మంత్రి హరీశ్ రావుకు వారు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

మల్లన్న సాగర్-కొండపోచమ్మ సాగర్ మధ్య ఉన్న సప్లై చానల్ కు గండికొట్టడం ద్వారా వేలాది ఎకరాలకు నీరు అందుతుందని భావిస్తున్నారు.

More Telugu News