Maharashtra: మహారాష్ట్ర హోం మంత్రిపై ముంబై మాజీ సీపీ సంచలన ఆరోపణలు.. తిప్పికొట్టిన దేశ్‌ముఖ్

  • సచిన్ వాజేకు నెలకు రూ. 100 కోట్ల టార్గెట్ విధించారు
  • పబ్‌లు, బార్లు రెస్టారెంట్ల నుంచి మామూళ్లు వసూలు చేయాలని ఆదేశించారు
  • వాజే నాకు చెప్పడంతో షాకయ్యా
  • ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ముంబై మాజీ సీపీ
Home minister asked cops to collect Rs 100cr per month alleged Parambir

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో విచారణ సరిగా చేయడం లేదంటూ ప్రభుత్వం ఇటీవల ఆయనను హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేసింది. తాజాగా, పరమ్‌బీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు 8 పేజీల లేఖ రాశారు.

అందులో హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వ్యవహారంలో అరెస్ట్ అయిన  అదనపు ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేతోపాటు ఏసీపీ సంజయ్ పాటిల్‌కు నెలకు రూ. 100 కోట్లు వసూలు చేసి తీసుకొచ్చి ఇవ్వాలని మంత్రి ఆదేశించారని పేర్కొన్నారు. ఇందుకోసం మార్గాలు కూడా సూచించారని తెలిపారు.

ముంబైలో మొత్తం 1,750 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయని, ఒక్కో దాని నుంచి నెలకు రూ. 2-3 లక్షలు వసూలు చేసినా రూ. 50 కోట్ల వరకు వస్తాయని, మిగతా సొమ్మును ఇతర వనరుల ద్వారా వసూలు చేయాలని టార్గెట్లు విధించారని ఆరోపించారు. వాజేను ఇంటికి పిలిపించుకుని మరీ ఈ టార్గెట్ విధించారని పరమ్‌బీర్ సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన నాకీ విషయం చెప్పడంతో షాకయ్యానన్నారు. అలాగే, ఏసీపీ సంజయ్ పాటిల్‌కు కూడా ఇదే టార్గెట్ విధించినట్టు తెలిపారు.

పరమ్‌బీర్ సింగ్ ఆరోపణలను మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నిండిన కారును పెట్టిన కేసులో సచిన్ వాజే అరెస్ట్ అయ్యారని అన్నారు. ఆ కారు యజమాని మన్‌సుఖ్ హిరేణ్ అనుమానాస్పద మృతి కేసులో వాజేతోపాటు పరమ్‌బీర్ సింగ్ హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. అరెస్ట్ భయంతోనే ఆయనీ ఆరోపణలు చేశారని, పరమ్‌బీర్‌పై పరువునష్టం దావా వేస్తానని అనిల్ దేశ్‌ముఖ్ హెచ్చరించారు.

More Telugu News