Narendra Modi: ఛాయ్‌వాలా కాకపోతే మీ బాధని ఇంకెవరు అర్థం చేసుకుంటారు?: ఎన్నికల ప్రచారంలో మోదీ

  • జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం
  • అధికారమే లక్ష్యంగా పర్యటిస్తున్న ప్రధాని
  • నేడు రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్న మోదీ 
  • బెంగాల్‌లో టీఎంసీపై, అసోంలో కాంగ్రెస్‌పై మండిపాటు
  • బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య
Modi Fires on TMC and Congress in election rallies

మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శనివారం ఆయన రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఒకటి పశ్చిమబెంగాల్‌లో కాగా.. మరొకటి దాని పొరుగునే ఉన్న అసోంలో జరిగింది.

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో జరిగిన సభలో మాట్లాడిన మోదీ.. తమకు ఐదేళ్లు అవకాశం ఇస్తే 70 ఏళ్ల అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇచ్చారు. బెంగాల్‌ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతో అవసరం అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం 130 మంది కార్యకర్తలు తమ ప్రాణాల్ని త్యాగం చేశారన్నారు.

ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్‌ ప్రజలు నమ్మకంతో దీదీకి అధికారం అప్పగిస్తే.. ఆమె అందుకు ప్రతిఫలంగా అవినీతి ఇచ్చిందని ఆరోపించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) క్రూరత్వానికి పాఠశాల వంటిదని విమర్శించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బెంగాల్‌లోని పేదల కోసం గత కొన్నేళ్లుగా 33 లక్షల పక్కా గృహాలను కేంద్రం ఆమోదించిందని తెలిపారు. కానీ ఎక్కడ మోదీ ప్రభుత్వానికి పేరు వస్తుందోనని దీదీ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ, నీటిపారుదల సహా శీతల గిడ్డంగుల సౌకర్యాలు సైతం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

అసోం ప్రజల నుంచి కాంగ్రెస్‌ దూరమైంది...

ప్రచారంలో భాగంగా నేడు మోదీ అసోంలోని చబువా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రతిష్ఠను భంగపరిచే వారికి కాంగ్రెస్‌ మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. అలాంటి పార్టీ ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. తనని తాను ఛాయ్‌వాలాగా అభివర్ణించుకున్న మోదీ.. ‘‘అసోం ప్రజల బాధను ఛాయ్‌వాలా కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ పార్టీ అసోం ప్రజల నుంచి పూర్తిగా దూరమైపోయిందన్నారు. శ్రీలంక, తైవాన్‌ చిత్రపటాలను చూపించి.. కాంగ్రెస్ పార్టీ వాటిని అసోంగా పేర్కొంటోందని ఆరోపించారు. ఇది అసోం ప్రజలకు జరిగిన అన్యాయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే బీజేపీ తొలి ప్రాధాన్యమని తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో అసోం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. తేయాకుతో పాటు ఇతర ఆర్గానిక్‌ ఆహార ఉత్పత్తుల్ని కూడా ఎగుమతి చేసే సామర్థ్యం అసోంకు ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వాటన్నింటికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

More Telugu News