Talasani: వాణీదేవి విజయం టీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్నిచ్చింది: తలసాని

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయం
  • హర్షం వ్యక్తం చేసిన తలసాని
  • ప్రతి రౌండులోనూ తమకే ఆధిక్యం లభించిందని వెల్లడి
  • అభివృద్ధిని చూసి ఓటేశారని వ్యాఖ్యలు
Talasani comments after Vani Devi victory in MLC elections

తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపొందడం తెలిసిందే. వాణీదేవికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన సమయంలో విపక్షాల నుంచి తీవ్ర వ్యాఖ్యలు వినిపించాయి. పీవీ కుమార్తె వాణీదేవిని బలిపశువును చేస్తున్నారని, ఓటమి ఖాయమని తెలిసి కూడా ఆ స్థానంలో దింపుతున్నారని సీఎం కేసీఆర్ పై విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ వాణీదేవి విజయం అందుకున్నారు. దీనిపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయం బీజేపీకి చెంపపెట్టు వంటిదని పేర్కొన్నారు. ఓటర్లు బీజేపీ చెంప చెళ్లుమనేలా తీర్పు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. కౌంటింగ్ సందర్భంగా ప్రతి రౌండ్ లోనూ వాణీదేవికే మెజారిటీ లభించిందని, ఆమె విజయం టీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్నిచ్చిందని తలసాని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గుర్తించారన్నదానికి వాణీదేవి గెలుపే నిదర్శనమని అన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ, శ్రేణులను నడిపించారని కొనియాడారు.

సీఎం కేసీఆర్ పాలనపై నమ్మకంతో పట్టభద్రులు, ఉద్యోగులు వాణీదేవికి ఓటేశారని తెలిపారు. విద్యారంగంలో ఎంతో అనుభవం ఉన్న వాణీదేవి గెలుపు పట్టభద్రుల, ఉద్యోగుల గెలుపు అని అభివర్ణించారు. నోటికొచ్చినట్టు మాట్లాడే విపక్షాలకు ఈ ఎన్నికల ద్వారా పట్టభద్రులు, ఉద్యోగులు తగిన బుద్ధి చెప్పారని తలసాని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పంథా మార్చుకోవాలని హితవు పలికారు.

More Telugu News