USA: జాతి వివక్షపై ఇకనైనా నోరు విప్పుదాం, అంతం చేద్దాం: అమెరికా అధ్యక్షుడు బైడెన్​ పిలుపు

  • ఏషియన్ అమెరికన్లపై దాడుల పట్ల ఆవేదన
  • వాటిపై మౌనం నేరంతో సమానమని కామెంట్
  • మాటలతో ఎన్నో నష్టాలు జరిగాయన్న అధ్యక్షుడు
  • ఏషియన్ అమెరికన్లతో సమావేశం
  • ఏషియన్ అమెరికన్లను బలిపశువులు చేశారన్న కమల
Racism is real in America we wont be silent says Biden


ఏషియన్ అమెరికన్లపై దాడులు జరగడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జాతి వివక్ష ఉందని, జాతి విద్వేష దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. దాడులపై ఎన్నో ఏళ్లుగా మౌనం వహిస్తున్నారని, అది కూడా నేరంతో సమానమని, ఆ తప్పును ఇకనైనా చేయొద్దని పిలుపునిచ్చారు. ‘‘ఇలాంటి దాడులపై ఇకనైనా నోరు విప్పుదాం. జాతి వివక్షను అంతం చేద్దాం’’ అని ప్రజలకు సూచించారు.

మంగళవారం అట్లాంటాలోని మసాజ్ సెంటర్లపై దుండుగులు జరిపిన కాల్పుల్లో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అందులో ఆరుగురు ఆసియా మహిళలే ఉన్నారు. జాతి వివక్ష దాడులని అధికారులు చెప్పకపోయినా.. ఇటీవలి కాలంలో ఆసియా వాసులపై దాడులు పెరిగిపోతుండడం, ప్రముఖులు గళాలు విప్పుతున్న సందర్భంలోనే కాల్పులు జరగడం చర్చనీయాంశమైంది.  ఈ నేపథ్యంలోనే శుక్రవారం బైడెన్.. కమలా హ్యారిస్ తో కలిసి జార్జియాలోని ఎమోరీ యూనివర్సిటీలో ఏషియన్ అమెరికా కమ్యూనిటీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.


కొవిడ్ 19 సమయంలో తూర్పు ఆసియా వాసులపై విద్వేష దాడులు పెరిగిపోయాయని బైడెన్ అన్నారు. దేశాన్ని ఎన్నో ఏళ్లుగా జాతి వివక్ష అనే మహమ్మారి పట్టి పీడిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దానిని అంతం చేసే దిశగా అమెరికన్లు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ద్వేషానికి చోటు లేదని, దానిని పారదోలాలని అన్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘‘లేనిపోని మాటలు ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. అవి కరోనాతో సమానం. వాటికి అడ్డుకట్ట వేయాల్సిందే’’ అని అన్నారు.

జాతి విద్వేషాలను కట్టడి చేయడం కోసం ఇద్దరు ఏషియన్ అమెరికన్ నేతలు కాంగ్రెస్ లో కొవిడ్ 19 హేట్ క్రైమ్స్ బిల్లును ప్రతిపాదించారని గుర్తు చేశారు. వీలైనంత తొందరగా కాంగ్రెస్ ఆ బిల్లును పాస్ చేసి చట్టంగా మారిస్తే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. బిల్లు ప్రకారం.. ఎవరిపైనైనా జాతి విద్వేష దాడులు జరిగితే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలనే బాధ్యులను చేస్తారన్నారు.

గత ఏడాది వరకు అమెరికాను పాలించిన గత ప్రభుత్వం ఏషియన్ అమెరికన్లను బలి పశువులుగా చేసిందని కమలా హ్యారిస్ మండిపడ్డారు. ఛాందసవాదులంతా కలిసి ఇలాంటి విద్వేషాన్ని రెచ్చగొట్టారని విమర్శించారు.

కాగా, మంగళవారం దాడుల ఘటనలో చనిపోయిన వారి వివరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. దావోయు ఫెంగ్ (44), డెలానియా యాష్లే యౌన్ (33), హ్యూన్ జంగ్ గ్రాంట్ (51), పాల్ ఆండ్రూ మిషెల్స్ (54), సూన్ షుంగ్ పార్క్ (74), సుంచా కిమ్ (69), షివావోజీ టాన్ (49), యోంగ్ ఏ యూ (63)లుగా గుర్తించారు. కాల్పుల్లో గాయపడిన మరో వ్యక్తి ఎల్చాయిస్ హెర్నాండెజ్ ఓర్టిజ్ (30) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు.

More Telugu News