Jaya Bachchan: మహిళల వస్త్రధారణపై ఉత్తరాఖండ్‌ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. జయా బచ్చన్‌ ఫైర్‌

  • మహిళలు టోర్న్‌ జీన్స్‌ వేసుకోవడంపై తీరథ్‌ సింగ్‌ వ్యాఖ్యలు
  • విరుచుకుపడ్డ మహిళా నేతలు, ప్రముఖులు
  • ఆలోచనా ధోరణి మార్చుకోవాలని సీఎంకు హితవు
  • ఆలోచించి మాట్లాడాలని జయా బచ్చన్‌ సూచన
Beware before commenting on ladies dressing style jaya bachhan warns Uttarakhand CM

యువతులు టోర్న్‌ జీన్స్‌ వేసుకోవడంపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళలు ఇలాంటి దుస్తులు ధరించి సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ బాలీవుడ్‌ నటి, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌ తీవ్రంగా మండిపడ్డారు.

సీఎం స్ధాయి వ్యక్తికి ఇలాంటి వ్యాఖ్యలు తగవని వ్యాఖ్యానించారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. ధరించే దుస్తుల ఆధారంగా ఎవరు ఎలాంటి వారో నిర్ణయిస్తారా? అని ప్రశ్నించారు. అదీ ఇలాంటి ఆధునిక సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. ఇది తప్పుడు ఆలోచనాధోరణి అని... ఇలాంటి వ్యాఖ్యలు మహిళలపై నేరాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

అంతకు ముందు రావత్‌ వ్యాఖ్యల పట్ల బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలి నందా సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టోర్న్‌‌ జీన్స్‌ ధరించిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన ఆమె... అలాంటి దుస్తులు వేసుకోవడానికి తాను గర్వంగా ఫీల్‌ అవుతానన్నారు. ‘మా వస్త్రధారణను మార్చడం కంటే ముందు మీ అభిప్రాయాలు, ఆలోచనా విధానాన్ని మార్చుకోండి’ అని సీఎంకు హితవు పలికారు.

ఇటీవలే ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తీరథ్‌‌ సింగ్‌ రావత్‌ మంగళవారం డెహ్రాడూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మహిళల వస్త్రధారణపై కామెంట్లు చేశారు. గత కొంతకాలం క్రితం ఓసారి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తన పక్కన కూర్చొన్న ఓ మహిళ రిప్డ్‌‌ జీన్స్‌ ధరించిందని, ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని తెలిపారు. ఇలాంటి దుస్తులు ధరించి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తారని వ్యాఖ్యానించారు.

More Telugu News