KCR: ఈ విష‌యాన్ని మీ ఎంపీలు పార్ల‌మెంటులో లేవ‌నెత్తితే బాగుంటుంది: భ‌ట్టిపై అసెంబ్లీలో కేసీఆర్ విమ‌ర్శ‌లు

  • కొత్త‌ వ్య‌వ‌సాయ చ‌ట్టాలు స‌రికాద‌న్న భ‌ట్టి విక్ర‌మార్క‌
  • సభా నిబంధ‌న‌లు భ‌ట్టికి బాగా తెలుస‌న్న కేసీఆర్
  • తెలంగాణ‌కు సంబంధించిన విష‌యాలు మాట్లాడుకుంటే మంచిదని వ్యాఖ్య
kcr slams bhatti

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు మూడో రోజు కొన‌సాగుతున్నాయి. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై చ‌ర్చ జ‌రుగుతోన్న స‌మ‌యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భ‌ట్టి మాట్లాడారు. వ్య‌వ‌సాయ రంగం గురించి త‌మిళిసై చాలా గొప్పగా చెప్పారని, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త‌ వ్య‌వ‌సాయ చ‌ట్టాలు మాత్రం చాలా ఇబ్బందిక‌రంగా ఉన్నాయని ఆయ‌న చెప్పారు.

ఈ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సిందేనంటూ ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారని, వారు ఆందోళ‌న చెందుతున్నారని తెలిపారు. దీంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై సీఎం కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ నేత‌ భ‌ట్టి విక్ర‌మార్క ఉప స‌భాప‌తిగా కూడా ప‌ని చేశారని, సభా నిబంధ‌న‌లు ఆయ‌న‌కు బాగా తెలుస‌ని అన్నారు. తాము వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చెప్పాల్సింది గ‌తంలోనే చెప్పామ‌ని కేసీఆర్ అన్నారు.

అసెంబ్లీలో తెలంగాణ‌కు సంబంధించిన విష‌యాలు మాట్లాడుకుంటే మంచిదని చురకంటించారు. కాంగ్రెస్ ఎంపీలు పార్ల‌మెంటులో ఆయా విష‌యాల‌పై మాట్లాడుకోవాల‌ని, కేంద్ర ప్ర‌భుత్వ‌ ప‌రిధిలో వ‌చ్చే విష‌యాలను అక్క‌డ మాట్లాడితేనే మంచిద‌ని చెప్పుకొచ్చారు.

More Telugu News