UK: కేన్సర్​ గుట్టును తేల్చేందుకు.. అతిచిన్న కెమెరాలు మింగనున్న 11 వేల మంది!

  • బ్రిటన్ ఎన్ హెచ్ఎస్ ప్రయోగాత్మక పరిశీలన
  • సెకనుకు రెండు ఫొటోలు తీయనున్న కెమెరా
  • ఆదిలోనే కేన్సర్ లను గుర్తించొచ్చంటున్న నిపుణులు
  • కరోనాతో దేశంలో ఆగిన ఎండోస్కోపీ పరీక్షలు
  • 2001 నుంచే అమెరికాలో టెక్నాలజీ
11000 patients in England to swallow tiny cameras to find cancer early

11,000 మంది.. అక్షరాలా పదకొండు వేల మంది చిన్న చిన్న కెమెరాలు మింగబోతున్నారు. ఆ కెమెరాలు ఎంత చిన్నగా ఉంటాయంటే.. ఏదైనా జబ్బు వస్తే మనం వేసుకునే ఓ గొట్టం గోలి (క్యాప్సూల్) పరిమాణంలోనే ఉంటాయి. అవేం చేస్తాయనేనా మీ అనుమానం? మామూలు కెమెరాల్లాగే అవీ ఫొటోలు తీస్తాయి. నోటి నుంచి మొదలై.. గొంతు, పేగులు, పొట్ట భాగాలను క్లిక్ మనిపిస్తాయి. ఎందుకంటారా..? కేన్సర్ ఉందా? లేదా? తెలుసుకోవడానికి.

బ్రిటన్​ లోని పెద్దాస్పత్రి అయిన నేషనల్​ హెల్త్​ సర్వీసెస్​ (ఎన్ ​హెచ్​ఎస్​) ఈ ప్రయోగం చేయబోతోంది. 40 ప్రాంతాల్లో 11 వేల మందితో ఈ పిల్​ కెమెరాలను మింగించనుంది. ప్రస్తుతం శరీరం లోపలి భాగాల్లో జబ్బులను గుర్తించేందుకు వాడుతున్న ఎండోస్కోపీకి ఇది ప్రత్యామ్నాయమని ఎన్​ హెచ్​ఎస్​ నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపు అన్ని ఆస్పత్రుల్లోనూ ఎండోస్కోపీ పరీక్షలను ఆపేశారని అక్కడి అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల చేస్తున్న అతికొద్ది మందికి మాత్రమే ఆ సేవలు అందుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ‘కొలన్​ క్యాప్సూల్​ ఎండోస్కోపీ’గా పిలిచే పిల్​ కెమెరాలను ప్రయోగాత్మకంగా ఎన్​ హెచ్​ఎస్​ వాడబోతోంది. 23 మిల్లీమీటర్ల సైజులో ఉండే ఈ కెమెరా సెకనుకు రెండు ఫొటోలను తీసి.. సమాచారాన్ని మణికట్టుకు పెట్టుకునే పరికరానికి పంపుతుంది. ఆ డేటా ద్వారా పెద్దపేగు కేన్సర్​ ఉందో లేదో తెలుసుకోనున్నారు వైద్య నిపుణులు. దీని ద్వారా పొట్ట, పేగు కేన్సర్​ లను ఆదిలోనే తెలుసుకునే వీలుంటుందని భావిస్తున్నారు. కాగా, 2001 నుంచే అమెరికాలో ఈ టెక్నాలజీని వాడుతున్నారు.

More Telugu News