Lagadapati Rajagopal: రాజకీయాల్లోకి రాకముందు నుంచే జగన్ తో పరిచయం ఉంది: లగడపాటి

  • జగన్ పాలన ఎలా ఉందనేది మూడేళ్ల తర్వాత తెలుస్తుంది
  • రాజకీయ పార్టీల మధ్య పోటీ ఎక్కువైపోయింది
  • ఓడిపోయినా ప్రజల్లో పవన్ ఉండటం గొప్ప విషయం
Have contact with Jagan before entering politics says Lagadapati Rajagopal

రాష్ట్ర విభజన సమయంలో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ హల్ చల్ చేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరమైన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తన సర్వేతో ప్రజల ముందుకు వచ్చిన లగడపాటి... ఆ తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మళ్లీ ప్రత్యక్షమయ్యారు. విజయవాడలో తన ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు.

ఓటు వేసిన అనంతరం మీడియాతో లగడపాటి ముచ్చటిస్తూ... జగన్ పాలన ఎలా ఉందనే విషయం మూడేళ్ల తర్వాత తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే జగన్ తో తనకు పరిచయం ఉందని చెప్పారు. రాజకీయ పార్టీల మధ్య పోటీ చాలా ఎక్కువైపోయిందని... అందుకే ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నాయని అన్నారు. వైయస్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా ఉండేవని చెప్పారు.

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానన్న మాటకు కట్టుబడే ఉన్నానని లగడపాటి చెప్పారు. రాజకీయ సర్వేలకు సైతం దూరంగా ఉన్నానని తెలిపారు. ఆలయాలపై దాడులు జరుగుతుండటానికి గల కారణాలను పోలీసులు, ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని చెప్పారు. గెలిచినా, ఓడినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను అట్టిపెట్టుకునే ఉన్నారని ప్రశంసించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైనా... స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగడం అభినందనీయమని కితాబునిచ్చారు.

More Telugu News