Avanthi Srinivas: రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రం చెప్పడం దారుణం: అవంతి శ్రీనివాస్

  • 32 మంది బలిదానంతో స్టీల్ ప్లాంట్ వచ్చింది
  • కేంద్రం ప్రకటనపై బీజేపీ నేతలు ఏం మాట్లాడతారు?
  • కేంద్రంతో లాలూచీ పడాల్సిన అవసరం మాకు లేదు
Avanthi Srinivas response on Viazag steel plant issue

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని పార్లమెంటు సాక్షిగా  నిన్న కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటామని తెలిపింది.

కేంద్రం చేసిన ప్రకటనపై రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం చెప్పడం దారుణమని అన్నారు. 60 గ్రామాల ప్రజలు, 32 మంది బలిదానంతో స్టీల్ ప్లాంట్ వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రకటనపై బీజేపీ నేతలు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ఈ అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడాలని డిమాండ్ చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి వైసీపీ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని అవంతి చెప్పారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి డిమాండ్ చేస్తామని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన తర్వాత తెలుగు ప్రజల రక్తం మరుగుతోందంటూ మాజీ ఎంపీ సబ్బం హరి మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు. సబ్బం హరి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శించకుండా జగన్, విజయసాయిరెడ్డిలను చంద్రబాబు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంతో లాలూచీ పడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. తాము గల్లీలో, ఢిల్లీలో పోరాటం చేస్తామని చెప్పారు.

More Telugu News