India: బ్రిటన్ పార్లమెంటులో భారత వ్యవసాయ చట్టాలపై చర్చ... తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం

  • భారత వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు
  • బ్రిటన్ లో లక్షలాది సంతకాలతో పిటిషన్
  • బ్రిటన్ చట్టసభలో పిటిషన్ దాఖలు చేసిన భారత సంతతి సభ్యుడు
  • తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ
Indian government condemns British parliament discussion on farm laws

భారత్ లో గత కొన్నినెలలుగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తుండడం బ్రిటన్ పార్లమెంటులోనూ చర్చకు వచ్చింది. భారత సంతతి పార్లమెంటు సభ్యుడు గుర్చ్ సింగ్ (లిబరల్ డెమొక్రాట్ పార్టీ) దాఖలు చేసిన పిటిషన్ మేరకు బ్రిటన్ పార్లమెంటులో భారత వ్యవసాయ చట్టాలపై చర్చ చేపట్టారు. లక్షల మంది బ్రిటీష్ ప్రజల సంతకాలతో కూడిన ఆ పిటిషన్ పై దాదాపు గంటన్నర సేపు చర్చించారు. చర్చ సందర్భంగా బ్రిటీష్ ఎంపీలు మోదీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.

దీనిపై బ్రిటన్ లో భారత హైకమిషన్, భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించాయి. మరొక ప్రజాస్వామ్య దేశానికి చెందిన రాజకీయాల్లో పూర్తిగా జోక్యం చేసుకోవడంగానే దీనిని భావిస్తున్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్ లో బ్రిటీష్ హైకమిషనర్ ను పిలిపించుకుని తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.

అటు, లండన్ లో భారత హైకమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా చట్టసభల్లో చర్చలు జరపడం ఆమోదయోగ్యం కాదని హితవు పలికింది. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అలాంటి దేశంపై అనుచిత ఆరోపణలు చేయడం, భారత వ్యవస్థలను తప్పుగా చిత్రీకరించడం తగదని పేర్కొంది. భారత్ లో స్వదేశీ మీడియాతో పాటు బ్రిటీష్ మీడియా సంస్థలు కూడా ఉన్నాయని, మరి భారత్ లో పత్రికా స్వేచ్ఛ లేదని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది. ఈమేరకు భారత హైకమిషన్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.

More Telugu News