KTR: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరంలేదన్న కేంద్రం... కేటీఆర్ ఆగ్రహం

  • కోచ్ ఫ్యాక్టరీపై సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించిన వైనం
  • తమ వైఖరి తెలిపిన కేంద్రం
  • అన్యాయం చేయడం కేంద్రానికి అలవాటుగా మారిందన్న కేటీఆర్
  • కోచ్ ఫ్యాక్టరీకి మంగళం పాడుతున్నారని వ్యాఖ్యలు
KTR fires on Union Government over a RTI query

తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు అలవాటుగా మారిపోయిందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా సంధించిన ప్రశ్నకు కేంద్రం బదులిస్తూ... కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరంలేదని స్పష్టం చేసింది. దాంతో కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కూడా కేంద్రం మంగళం పాడుతోందని విమర్శించారు.

కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ పలుమార్లు కోరారని, 150 ఎకరాల భూమిని కేంద్రానికి కూడా అప్పగించడం జరిగిందని వెల్లడించారు. కానీ రైల్వేల విషయంలో కేంద్రం ప్రతిసారి తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉందని తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు అని కేటీఆర్ ఉద్ఘాటించారు.

పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ అంశంపై రాబోయే పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తారని, కేంద్రాన్ని నిలదీస్తారని వెల్లడించారు.

More Telugu News