Tea: ఇక్కడ ఒక కప్పు టీ రూ.1000!

  • కోల్ కతాలో నీర్జాష్ టీ స్టాల్ కు ప్రత్యేక గుర్తింపు
  • నాణ్యమైన తేయాకు వినియోగం
  • సిల్వర్ నీడిల్ వైట్ టీ ఇక్కడ ప్రత్యేకత
  • ప్రపంచంలోనే స్వచ్ఛమైన టీలలో ఇదొకటని చెప్పిన యజమాని 
Most expensive tea available in Kolkata

వేడివేడిగా ఓ కప్పు టీ తాగి తమ దినచర్యలను ప్రారంభించేవారు మన దేశంలో కోట్ల మంది ఉంటారు. సాధారణంగా టీ స్టాళ్లలో ఓ కప్పు టీ రూ.10, మసాలా టీ అయితే ఇంకో పదో, ఇరవయ్యో ఎక్కువుంటుంది. అయితే కోల్ కతాలోని ఓ టీ స్టాల్ లో మాత్రం ఒక కప్పు టీ తాగితే రూ.1000 చెల్లించాల్సిందే. ఇంతజేసీ ఈ చాయ్ దుకాణం ఓ చెట్టు కింద ఉంటుందంటే ఆశ్చర్యం కలగకమానదు.

కోల్ కతాలోని ముకుంద్ పూర్ ఏరియాలో ఉండే ఈ నీర్జాష్ టీ స్టాల్ యజమాని పేరు పార్థ ప్రతిమ్ గంగూలీ. 2014లో ప్రారంభించిన ఈ చాయ్ దుకాణం ప్రత్యేకత ఏంటంటే... ఇక్కడన్నీ ఫ్లేవర్డ్ టీలు అందిస్తారు. ఒక్కో టీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఊలాంగ్ టీ, లావెండర్ టీ, మకాయ్ బరి టీ ఇలా అనేక రకాలుగా చాయ్ తయారు చేస్తారు.

ఈ టీ స్టాల్ లో ఉపయోగించే తేయాకు అత్యున్నతమైన నాణ్యత కలిగివుంటుంది. ఎంపిక చేసిన తేయాకు తోటల నుంచి సేకరించిన తేయాకునే ఇక్కడ ఉపయోగిస్తారు. అందుకే నీర్జాష్ టీ స్టాల్ లో దొరికే టీకి అంత రుచి, అంత ధర! ఇక్కడ సుమారు 100 రకాల టీలు లభ్యమవుతాయి. వీటిలో 75 రకాల టీ పొడులను డార్జిలింగ్ నుంచి సేకరిస్తారు. మిగిలిన వాటిని ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తారు.

ఈ టీ స్టాల్ యజమాని గంగూలీ మాట్లాడుతూ, తాము తయారుచేసే సిల్వర్ నీడిల్ వైట్ టీ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన చాయ్ లలో ఒకటి అని వెల్లడించారు. 100 కేజీల బ్లాక్ టీ కంటే దీనికి మూడు రెట్లు అత్యధిక సమయం, ఖర్చు, శ్రమ అవసరమవుతాయని, అందుకే ఇది అత్యంత ఖరీదైన టీ అని వివరించారు. గ్రీన్ టీలో కంటే వైట్ టీలో అధికంగా ప్రత్యేకమైన యాంటీఆక్సిడాంట్లు, ఫైటో కెమికల్స్, కాటెచిన్స్, ఎకో కాటెచిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయని గంగూలీ తెలిపారు.

More Telugu News