Vizianagaram: స్నేహితులతో వెళ్లినట్టు తెలిసిపోతుందనే.. డిగ్రీ విద్యార్థిని కేసులో వీడిన మిస్టరీ

  • ఈ నెల ఒకటో తేదీన గుర్లలో తుప్పల్లో కనిపించిన విద్యార్థిని
  • బాయ్‌ఫ్రెండ్‌ను కలిసి తిరిగి వస్తూ గుర్లలో దిగిన యువతి
  • చున్నీతో కాళ్లు, చేతులు కట్టుకుని కిడ్నాప్‌కు గురైనట్టు నాటకం
Mystery revealed in Vizianagaram Degree Student kidnap case

విజయనగరం జిల్లా గుర్లలో ఇటీవల కిడ్నాప్‌కు గురైనట్టు భావిస్తున్న డిగ్రీ విద్యార్థిని (24) కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తేలింది. బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లిన విషయం ఇంట్లో తెలిసి పోతుందన్న ఉద్దేశంతో ఆమె ఈ కిడ్నాప్ నాటకం ఆడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

 పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల ఒకటో తేదీన విజయనగరం జిల్లా గుర్లలో రోడ్డుపక్కన ఉన్న తుప్పల్లో ఓ డిగ్రీ విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో కనిపించింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే గుర్ల పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను విజయనగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన విషయం తెలిసిపోతుందన్న ఉద్దేశంతోనే ఆమె ఈ నాటకానికి తెరతీసినట్టు గుర్తించారు.  

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాబాయ్ దగ్గరకు వెళ్తానని చెప్పి గత నెల 27న బాధిత విద్యార్థిని హాస్టల్‌లో పర్మిషన్ తీసుకుని స్నేహితుడిని కలిసేందుకు వెళ్లింది. అయితే, అదే సమయంలో ఆమె సోదరుడు హాస్టల్‌లో తన గురించి వాకబు చేసిన విషయం తెలిసింది. స్నేహితుడిని కలిసిన అనంతరం హాస్టల్‌కు బయలుదేరింది. పాలకొల్లు నుంచి పాలకొండ వెళ్తున్న బస్సు ఎక్కిన విద్యార్థిని గుర్ల దాటిన తర్వాత బస్సు దిగింది.

రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి చున్నీతో కాళ్లు చేతులు కట్టేసుకుంది. అనంతరం అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు నటించింది. విచారణలో విద్యార్థిని ఈ విషయాన్ని అంగీకరించినట్టు ఎస్పీ రాజకుమారి తెలిపారు. విద్యార్థినిది తెర్లాం మండలంలోని లోచర్లగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News