Moon: అందరికీ టికెట్లు కొనేశా.. రండి, పోదాం చంద్రుడిపైకి: జపాన్​ బిలియనీర్​ ఆఫర్​

  • ఎనిమిది మందికి జాబిల్లి టికెట్లు బుక్ చేశానని వెల్లడి
  • మార్చి 14లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన
  • సీటు దక్కాలంటే రెండు షరతులు
Japan Billionaire offers ride for public but on two conditions

చాన్స్ రావాలేగానీ.. చందమామను అందుకోవాలని ఎవరికుండదు? అలాంటి అవకాశమే వచ్చింది జపాన్ కోటీశ్వరుడు యుసాకు మేజావాకు. 2023లో స్పేస్ ఎక్స్ చంద్రుడి వద్దకు వెళ్లే ప్రయాణానికి సంకల్పించింది. అక్కడకు వెళ్లాలనుకునే ఔత్సాహికుల నుంచి 2018లో దరఖాస్తులను ఆహ్వానించింది. అలా చంద్రుడి మీదకు టికెట్లు బుక్ చేసుకున్న తొలి వ్యక్తిగా యుసాకు నిలిచారు.

తనతో పాటు మరో 6 నుంచి 8 మందికి టికెట్లు కొంటానని, కళాకారులు అయి ఉండాలని అప్పట్లో యుసాకు చెప్పారు. తాజాగా 8 టికెట్లు కొన్నట్టు నేడు ఆయన ప్రకటించారు. తనతో చంద్రుడి వద్దకు రావాలని జనానికి పిలుపునిచ్చారు. ప్రపంచంలోని ఎక్కడివారైనా ఆసక్తి ఉన్నవారు మార్చి 14 లోపు దరఖాస్తులు పంపాలని సూచించారు. అయితే అందుకు ఆయన రెండు షరతులు పెట్టారు.

కొత్తగా చేసే ఎవరైనా తన దృష్టిలో కళాకారులతో సమానమేనని, అందుకే కళాకారులనే తీసుకెళ్తానని అప్పట్లో చెప్పానని అన్నారు. కాబట్టి ఇప్పుడు దరఖాస్తు చేసుకునేవారు.. రెండు షరతులకు లోబడి ఉండాలన్నారు. ఒకటి.. ఏదైనా కొత్తగా చేసేందుకు తమను తాము ప్రోత్సహించుకోవడం, రెండు.. కొత్తగా చేయాలనుకునే ఎదుటి వారికీ ప్రోత్సాహం అందించడం వంటి లక్షణాలుండాలని యుసాకు తేల్చి చెప్పారు.

మొత్తంగా వ్యోమనౌకలో 12 మంది దాకా ప్రయాణిస్తారని, చంద్రుడిని ఓ సారి చుట్టేసి మళ్లీ భూమి మీదకు వచ్చేస్తారని చంద్రుడిపైకి ట్రిప్ గురించి వివరించారు. దరఖాస్తులను పరిశీలించి మార్చి 21న స్క్రీనింగ్ మొదలుపెడతామని చెప్పారు. అయితే, ఎంపికలో ఆ తర్వాతి దశల గురించి మాత్రం యుసాకు వెల్లడించలేదు.

More Telugu News