AB Venkateswara Rao: సస్పెన్షన్ పొడిగింపును సవాలు చేసేందుకు ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టు అనుమతి

  • గతంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ
  • అవినీతి ఆరోపణలపై సస్పెన్షన్
  • సస్పెన్షన్ ను పొడిగించిన సర్కారు
  • సుప్రీంను ఆశ్రయించిన ఏబీ
  • మూడు రోజుల గడువు ఇచ్చిన సుప్రీం ధర్మాసనం
Supreme Court gives nod to AB Venkateswararao to challenge suspension extension orders

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం ఆయనపై వేటు వేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన సస్పెన్షన్ ను మరికొన్ని నెలలు పొడిగించింది. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను జస్టిస్ ఖన్ విల్కర్, జస్టిస్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఏబీని సస్పెన్షన్ లో ఉంచడంపై రాష్ట్రప్రభుత్వాన్ని సర్వీస్ నిబంధనలు వెల్లడించాలని కోరింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిస్తూ రూల్-3లో 1-సీ కింద సస్పెన్షన్ పొడిగించామని ధర్మాసనానికి తెలిపారు. రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు 6 నెలల తర్వాత సస్పెన్షన్ పొడిగించామని వివరించారు.

ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది స్పందిస్తూ.... ఏడాది కంటే ఎక్కువ సస్పెన్షన్ లో ఉంచేందుకు వీల్లేదని తెలిపారు. అయితే, రివ్యూ కమిటీ ఆదేశాలను ఎందుకు సవాల్ చేయలేదని ధర్మాసనం ఏబీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దాంతో, కమిటీ ఆదేశాలను సవాలు చేసేందుకు 3 రోజుల గడువు కావాలని ఏబీ న్యాయవాది కోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో, రివ్యూ కమిటీ సస్పెన్షన్ పొడిగింపు ఆదేశాలను సవాల్ చేసేందుకు ఏబీకి కోర్టు అనుమతినిచ్చింది. తర్వాతి 3 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.

More Telugu News