Prince Harry: బ్రిటిష్​ పత్రికల విషపు రాతల వల్లే బయటికొచ్చేశాం: ప్రిన్స్​ హ్యారీ

  • జేమ్స్ కార్డన్ ఇంటర్వ్యూలో వ్యాఖ్య
  • తానేమీ కావాలని బయటకొచ్చేయలేదన్న హ్యారీ
  • ఓ భర్తగా, ఓ తండ్రిగా చేయాల్సింది చేశానని వెల్లడి
  • బ్రిటన్ పత్రికల రాతలు మానసికంగా కుంగదీశాయని ఆవేదన
Prince Harry on James Corden show says toxic British press drove him and Meghan away

రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేయడంపై బ్రిటన్ యువరాజు హ్యారీ స్పందించారు. జేమ్స్ కార్డన్ ఇంటర్వ్యూలో ఆ విషయాలను పంచుకున్నారు. తానేమీ కావాలని రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేయలేదన్నారు. బ్రిటీష్ పత్రికల విషపు రాతల వల్లే అలా చేయాల్సి వచ్చిందన్నారు. వారి రాతలు, చేతలతో తాను మానసికంగా కుంగిపోయానని చెప్పారు.

‘‘బ్రిటీష్ ప్రెస్ ఏం చేయగలదో మనందరికీ తెలుసు. ప్రెస్ విషం వెళ్లగక్కింది. వారి వల్లే నేను రాజకుటుంబం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఓ భర్తగా, ఓ తండ్రిగా నేను చేయాల్సింది చేశాను’’ అని వివరించారు. అయితే, అది అందరు అనుకుంటున్నట్టు విడిపోవడం మాత్రం కాదని చెప్పారు.

బ్రిటన్ లో ఉన్నట్టే లాస్ ఏంజిలిస్ లోనూ తమ జీవితం సాఫీగా సాగుతోందని హ్యారీ చెప్పారు. కాకపోతే కొంచెం కొత్తగా ఉందని అన్నారు. తన జీవితం ఎప్పటికీ ప్రజా సేవకే అంకితమన్నారు. మెఘన్ కూడా తనకు మద్దతుగా నిలిచిందన్నారు. ఇద్దరం ప్రజా సేవలో బిజీగా ఉన్నామన్నారు.    

త్వరలో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న 'ద క్రౌన్' పైనా ఆయన మాట్లాడారు. తన గురించి, తన భార్య గురించి, తన కుటుంబం గురించి మీడియాలో వచ్చిన కథల కన్నా.. ద క్రౌన్ లో చూపించిన కథ చాలా బాగుందని అన్నారు. నిజాలను నిజాలుగా చెప్పేందుకు ప్రయత్నించారన్నారు. అందులో ఉన్నవన్నీ నిజాలు కాకపోయినా.. చాలా వరకు మాత్రం నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలే ఉన్నాయన్నారు.

More Telugu News