PNB Scam: నీరవ్ మోదీపై అభియోగాలు రుజువయ్యాయన్న యూకే కోర్టు... భారత్ కు అప్పగింతకు మార్గం సుగమం

  • సంచలనం సృష్టించిన పీఎన్ బీ స్కాం
  • రూ.14 వేల కోట్లు ఎగవేసి పారిపోయిన నీరవ్ మోదీ
  • 2019లో లండన్ లో అరెస్ట్
  • భారత్ రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు
UK Court verdict on Nirav Modi issue

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. నీరవ్ మోదీపై మోపిన మనీ లాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని యూకే కోర్టు తీర్పు వెలువరించింది. నీరవ్ మోదీ మానసిక స్థితి సరిగా లేదన్న వాదనలను కొట్టిపారేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో భారత్ సమర్పించిన ఆధారాలు సరిపోలుతున్నాయని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి శామ్యూల్ గూజీ పేర్కొన్నారు. నీరవ్ మోదీ చట్టబద్ధంగా వ్యాపారం చేయలేదన్న విషయాన్ని ఆధారాలు నిరూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

నీరవ్ మోదీని భారత్ కు అప్పగిస్తే న్యాయం జరగదన్న వాదనలను కూడా జడ్జి అంగీకరించలేదు. భారత్ కు అప్పగిస్తే అన్యాయం జరుగుతుందనడం సరికాదని పేర్కొన్నారు. కాగా, తమ తీర్పుపై పై కోర్టుకు అప్పీల్ కు వెళ్లొచ్చని తెలిపారు.పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.14 వేల కోట్లు ఎగవేసిన నీరవ్ మోదీ బ్రిటన్ పారిపోయిన సంగతి తెలిసిందే. 2019లో అతడిని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటినుంచి నీరవ్ మోదీని భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోంది.

More Telugu News