Joe Biden: వలసదారుల రాకపై నిషేధం ఎత్తివేసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

  • గతంలో వీసా బ్యాన్ నిర్ణయం తీసుకున్న ట్రంప్
  • ట్రంప్ నిర్ణయాన్ని పునఃసమీక్షించిన బైడెన్
  • ట్రంప్ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన
  • గత నిర్ణయాలతో దేశానికి చేటు అని వ్యాఖ్యానించిన బైడెన్
Joe Biden government withdraws visa ban on immigrants

ఇమ్మిగ్రేషన్ అంశంలో గత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను వరుసగా సమీక్షించుకుంటూ వస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వలసదారులు దేశంలో ప్రవేశించకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తొలగించారు. నాటి నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకుంటున్నట్టు బైడెన్ తాజాగా ప్రకటించారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు.

గతేడాది వీసాలు పొందిన, పొందాలనుకునేవారికి మునుపటి నిర్ణయాలు ప్రతికూలంగా మారాయని... ఈ నిర్ణయాలు వలసదారులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రతిబంధకమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను అమెరికా సంస్థలు కోల్పోతాయని అన్నారు.

అటు, అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం అటార్నీ కర్టిస్ మారిసన్ అధ్యక్షుడి తాజా నిర్ణయాన్ని స్వాగతించారు. బైడెన్ ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను రప్పించేందుకు అమెరికా గతంలో గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమం చేపట్టింది.

 అయితే ట్రంప్ నిర్ణయం ఈ కార్యక్రమ స్ఫూర్తిని దెబ్బతీసిందని బైడెన్ ప్రభుత్వ వర్గాలు భావించాయి. సంవత్సరానికి 55 వేల మందికి గ్రీన్ కార్డులు మంజూరు చేసేందుకు ఈ కార్యక్రమం తీసుకువచ్చారు. అయితే, ట్రంప్ హయాంలో వీసా నిబంధనలను ఎక్కడికక్కడ కఠినతరం చేయడంతో వలసదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

More Telugu News