New Delhi: 8వ తరగతి వరకూ ఆన్ లైన్ పరీక్షలే... ఢిల్లీ నిర్ణయం!

  • ఆదేశాలు వెలువరించిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్
  • కరోనా ఇంకా నియంత్రణలోకి రాకపోవడం వల్లే
  • వర్క్ షీట్ల ఆధారంగా మార్కులు కేటాయించాలని ఆదేశం
No Offline Exams in Delhi upto 8th This Year

ఈ సంవత్సరం 8వ తరగతి వరకూ చదివే విద్యార్థులు పాఠశాలకు హాజరై పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆదేశాలు వెలువరిస్తూ, 8వ తరగతిపైన చదివేవారికి మాత్రమే ఆఫ్ లైన్ పరీక్షలు నిర్వహించాలని, మిగతా విద్యార్థులందరికీ ఆన్ లైన్ మాధ్యమంగానే ఎగ్జామ్స్ పెట్టాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది.

2020-2021 విద్యా సంవత్సరానికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని, కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ విద్యా శాఖ అదనపు డైరెక్టర్ రీతా శర్మ వ్యాఖ్యానించారు.

ప్రాధమిక, మాధ్యమిక స్థాయిలో ఇంతవరకూ ఒక్క క్లాస్ కూడా ప్రత్యక్షంగా సాగలేదని గుర్తు చేసిన ఆమె, ఈ సంవత్సరం 3 నుంచి 8వ తరగతి వరకూ సబ్జెక్టుల వారీగా ఆన్ లైన్ అసెస్ మెంట్ జరుగుతుందని వెల్లడించారు. వర్క్ షీట్స్ ఆధారంగా మార్కులను కేటాయిస్తామని, మార్చి 1 నుంచి 15 వరకూ విద్యార్థులకు అసైన్ మెంట్స్ ఇవ్వాలని ఆదేశించారు.

వీటికి 50 మార్కులు, శీతాకాలంలో ఇచ్చిన అసైన్ మెంట్స్ కు 40 మార్కులను కేటాయిస్తారని తెలిపారు. ఎవరైనా విద్యార్థి వద్ద డిజిటల్ డివైస్ లు లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుంటే, వారి తల్లిదండ్రులకు స్కూల్ నుంచి ఫోన్ వస్తుందని, అసైన్ మెంట్, ప్రాజెక్టుల హార్డ్ కాపీలను వారికి అందిస్తారని పేర్కొన్నారు.

More Telugu News