KTR: పీవీ కుమార్తె అయినా ఆమెలో గర్వం కనిపించలేదు: కేటీఆర్

  • పీవీ కుటుంబానికి గౌరవం కలిగేలా ఆమెను ఎన్నికల బరిలో నిలబెట్టాం
  • దేశానికి పీవీ చేసిన సేవలు మరువలేనివి
  • జీహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్సే నెంబర్ వన్
PVs daughter doesnt have proud says KTR

దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబానికి గౌరవం కలిగేలా ఆయన కుమార్తె వాణీదేవిని టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపామని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో ఈ మూడు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానిగా పని చేసిన ఏకైక వ్యక్తి పీవీ అని, దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. పీవీ కూతురు అయినా వాణీదేవిలో ఏమాత్రం గర్వం లేదని అన్నారు.

2004-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా కేవలం 24 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని కేటీఆర్ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 32 వేల 799 ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ఉద్యోగుల శ్రమ దోపిడీని తగ్గించిన ఘనత టీఆర్ఎస్ దేనని చెప్పారు.

న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించామని తెలిపారు. స్వతహాగా లాయరైన బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు న్యాయవాదుల సంక్షేమానికి కేంద్రం నుంచి ఏం తెచ్చారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్సే నెంబర్ వన్ అని... అందుకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను తాము సాధించామని చెప్పారు.

More Telugu News