Salary Hike: నూతన వేతన నిబంధనలు: జీతాలు పెరిగినా.. చేతికొచ్చేది తక్కువే!

  • చాలా కంపెనీలు ఎక్కువ పీఎఫ్ చెల్లించేందుకే మొగ్గు చూపే అవకాశం
  • జీతాల పెంపుపై ఏయాన్ అనే సంస్థ అధ్యయనం
  • వేతనాలు పెంచేందుకు 88% కంపెనీల ఆసక్తి
  • సగటున 7.7 శాతం దాకా పెరిగే చాన్స్
Higher provident fund outgo may blunt salary hikes

ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలు పెరిగినా.. చేతికొచ్చే మొత్తం మాత్రం తక్కువేనట. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వేతనాల నిబంధనల ప్రకారం.. సంస్థలు ఎక్కువ భవిష్య నిధి (పీఎఫ్)ని చెల్లించాలని నిర్ణయిస్తే ఉద్యోగులకు చేతికొచ్చే జీతంలో కోతలు తప్పేలా లేవు. ఆ మొత్తం నేరుగా పీఎఫ్ కింద జమయ్యే అవకాశం ఉంది. జీతాల పెంపుపై ఏయాన్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ ఏడాది జీతాలు పెంచేందుకు 88 శాతం సంస్థలు ఆసక్తి చూపించాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది 75 శాతం కంపెనీలే జీతాలు పెంచుతామని స్పష్టం చేశాయి.

అయితే, ఈ సంవత్సరం కరోనా నుంచి కోలుకోవడం, బిజినెస్ లు పుంజుకోవడంతో జీతాలు పెంచాలనుకుంటున్న కంపెనీల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది సగటున 7.7 శాతం చొప్పున జీతాలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్టు సర్వే తేల్చింది. గత ఏడాది కేవలం 6.1 శాతంగానే ఉంది. బ్రిక్ దేశాలకు సంబంధించి భారత్ లోనే జీతాల పెంపు ఎక్కువ అని ఏయాన్ స్టడీ పేర్కొంది.

కాగా, కొత్త నిబంధనల ప్రకారం చేతికొచ్చే జీతం తక్కువే అయినా.. దాని ప్రభావం మాత్రం అంతగా ఉండదని ఏయాన్ సీఈవో నితిన్ సేథి చెప్పారు. చాలా వరకు పెద్ద సంస్థలు మొత్తం సీటీసీలో 35 నుంచి 40 శాతం దాకా మూల వేతనం కిందే ఇస్తున్నాయని, కాబట్టి కొత్త నిబంధనల ప్రభావం అంతగా ఏమీ ఉండకపోవచ్చని అన్నారు. అయితే, ఎప్పటివో కొన్ని ఇంజనీరింగ్ సంస్థలు.. కేవలం 25 శాతం వరకే మూల వేతనం ఇస్తున్నాయని, వాటిపై మాత్రం భారం పడుతుందని చెప్పారు.

More Telugu News