Karti Chidambaram: సుప్రీంకోర్టులో కార్తీ చిదంబరంకు ఊరట

  • మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా కార్తీ
  • 22 రోజుల పాటు తీహార్ జైల్లో గడిపిన కార్తీ
  • విదేశాలకు వెళ్లేందుకు అనుమతించిన సుప్రీంకోర్టు
Supreme Court Allows Karti Chidambaram To Travel Abroad

కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతిని సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసింది. రూ. 2 కోట్లను కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రూ. 305 కోట్ల ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కార్తీ చిదంబరం విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

మరోవైపు రూ. 2 కోట్లు డిపాజిట్ చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని వేరే కోర్టు ఆదేశించిందని... అదే మొత్తాన్ని సుప్రీంకోర్టు కూడా కొనసాగించాలని కోరింది. ఈ నేపథ్యంలో కార్తీ తరపున వాదిస్తున్న కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ వాదిస్తూ... తన క్లయింట్ పార్లమెంటు సభ్యుడని, ఆయన ఎక్కడికీ పారిపోరని అన్నారు. రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలనే ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. సిబాల్ వాదనతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం రూ. 2 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

మరోవైపు ఈ కేసులో 22 రోజుల పాటు ఢిల్లీలోని తీహార్ జైల్లో కార్తీ చిదంబరం గడిపారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు.

More Telugu News