Advocate Couple: ఊళ్లో గుడి నిర్మాణ వివాదమే వామనరావు, నాగమణి హత్యకు కారణం: పోలీసులు

  • పెద్దపల్లి జిల్లాలో అడ్వొకేట్ దంపతుల దారుణ హత్య
  • ముగ్గుర్ని అరెస్ట్ చేశామన్న పోలీసులు
  • కుంట శ్రీను ప్రధాన నిందితుడు అని వెల్లడి
  • చిరంజీవి ఏ2, అక్కపాక కుమార్ ఏ3 అని వివరణ
Police arrests reveals advocate couple murder case details

పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద హైకోర్టు అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణిల దారుణ హత్యకు కారకులైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. కుంట శ్రీనివాస్, కుమార్, చిరంజీవి అనే వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఐజీ నాగిరెడ్డి వివరాలు తెలిపారు. వామనరావు దంపతుల హత్యకేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేశామని చెప్పారు. వామనరావు హత్యకేసులో కుంట శ్రీను ప్రధాన నిందితుడు అని వెల్లడించారు. ఈ ఘటనలో శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ ఇతర నిందితులు అని వివరించారు.

వామనరావు దంపతుల హత్యకేసులో ఏ1 కుంట శ్రీను అని, ఏ2 చిరంజీవి, ఏ3 అక్కపాక కుమార్ అని ఐజీ తెలిపారు. తనకు సంబంధించిన ప్రతి అంశంలో వామనరావు అడ్డుతగులుతున్నాడన్న కోపంతో కుంట శ్రీను ఈ ఘాతుకానికి పథకం రచించాడని తెలిపారు. ప్రధానంగా వామనరావు, నాగమణి దంపతులు ఊళ్లో నిర్మిస్తున్న పెద్దమ్మగుడికి సంబంధించిన వివాదంలో కుంట శ్రీను కక్ష పెంచుకున్నాడని వెల్లడించారు. తనను అనేక వివాదాల్లో వామనరావు న్యాయపరంగా అడ్డుకుంటుండడంతో, భరించలేకపోయాడని అన్నారు.

అక్కపాక కుమార్ ఇచ్చిన సమాచారంతో శ్రీను, చిరంజీవి ఈ హత్య చేశారని, మొదట కారుతో వామనరావు దంపతులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టారని పేర్కొన్నారు. వారు వాహనం ఆపగానే విచక్షణ రహితంగా దాడి చేశారని, శ్రీనివాస్, చిరంజీవి ఇద్దరూ కలిసి కత్తులతో నరికారని వెల్లడించారు. ముందు నాగమణిపై దాడి చేశారని, ఆపై వామనరావుపై దాడి చేశారని వివరించారు.

హత్య అనంతరం నిందితులు సుందిళ్ల వైపు వెళ్లారని, రక్తంతో తడిసిన బట్టలను అక్కడి బ్యారేజిలో పడేశారని, ఆపై మహారాష్ట్ర పారిపోయారని అన్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను పట్టుకున్నామని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. శ్రీను, చిరంజీవిని మహారాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకున్నామని, ఈ హత్యకేసుతో సంబంధం ఉన్న అక్కపాక కుమార్ ను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు.

ఈ ఘటనలో నిందితులకు వాహనం ఇచ్చినట్టుగా ఓ వ్యక్తి పేరు వినిపిస్తోందని, పూర్తి వివరాలు తెలుసుకుని ఆ వ్యక్తి పేరు వెల్లడిస్తామని అన్నారు. కాగా, ఈ హత్యల వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు వెల్లడికాలేదు అని ఐజీ స్పష్టం చేశారు. ఆలయ భూమి వివాదమే ఈ హత్యకు దారితీసిందని భావిస్తున్నామని అన్నారు. పైగా, రామాలయం కమిటీ విషయంలోనూ వివాదం నడుస్తోందని, కుంట శ్రీనుపై గతంలోనూ కేసులు ఉన్నాయని చెప్పారు.

More Telugu News