Revanth Reddy: సాక్ష్యం కళ్లముందుంది... చర్యలేవి కేసీఆర్?: రేవంత్ రెడ్డి

  • హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతుల దారుణ హత్య
  • టీఆర్ఎస్ నాయకుడే హత్య చేశాడనే సాక్ష్యం ఉందన్న రేవంత్
  • న్యాయాన్ని అన్యాయం నరికి చంపిందని ఆవేదన
Revanth Reddy demands KCR to take action in Vaman Raos murder

తెలంగాణలోని మంథని నియోజకవర్గంలో హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతులను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... న్యాయాన్ని అన్యాయం నడిరోడ్డుపై నరికి చంపిందని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులు టీఆర్ఎస్ నాయకులే అనే సాక్ష్యం కళ్లముందు ఉందని... వారిపై చర్యలేవి కేసీఆర్ అని ప్రశ్నించారు. వామనరావు తన ప్రాణాలను కోల్పోయే ముందు తనపై దాడికి పాల్పడింది ఒక టీఆర్ఎస్ నాయకుడని చెప్పారు. ఆయన పేరును వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరోవైపు ఇదే ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, వామనరావు హత్యకు కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. మంథని ప్రాంతంలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ గూండాయిజం, రౌడీయిజం పెరిగిపోయానని అన్నారు. పుట్ట మధుకర్ అన్యాయాలను ప్రశ్నించినందుకే హత్య చేశారని ఆరోపించారు. సాక్షాత్తు టీఆర్ఎస్ మండల ప్రెసిడెంటే ఈ హత్య చేశారంటే రౌడీయిజం ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతోందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి పోలీసులు కూడా కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.

More Telugu News