KCR: 68వ ఏట అడుగుపెట్టిన కేసీఆర్... నేడు ఘనంగా బర్త్ డే!

  • రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు
  • కోటి వృక్షార్చన నిర్వహించనున్న జోగినపల్లి
  • కారణ జన్ముడని వ్యాఖ్యానించిన హరీశ్ రావు
Telangana CM KCR Birthday Today

తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు నేడు పుట్టిన రోజును జరుపుకుంటూ 68వ పడిలోకి ప్రవేశించారు. ఆయన జన్మదిన వేడుకలు నేడు వినూత్నంగా జరగనున్నాయి. ఇప్పటికే గత వారం రోజులుగా టీఆర్ఎస్ నాయకులు తమతమ నియోజకవర్గాల్లో పలు రకాల క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవన్నీ నేటితో పూర్తి కానున్నాయి. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలోనే తెలంగాణ జాగృతి, రాష్ట్ర స్థాయిలో వాలీబాల్ పోటీలను నిర్వహించింది.

ఇక నేడు పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, వీల్ చైర్ల పంపిణీలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటనున్నారు. గంటలో కోటి మొక్కలను నాటాలన్న లక్ష్యంతో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ నేడు కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మరోపక్క, ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం తరువాత క్యాంపు కార్యాలయానికి వచ్చి నేతలు, అభిమానులను కలుస్తారని తెలుస్తోంది.

కేసీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అభినందనలు తెలిపిన హరీశ్ రావు, ఆయన కారణ జన్ముడని, ఆయన కృషి ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సిద్ధించి, ఇక్కడి ప్రజల తలరాత మారిందని అన్నారు. ఇక హోమ్ మంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ, తెలంగాణకు దేవుడిచ్చిన బహుతిగా కేసీఆర్ ను అభివర్ణించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల్లో ఆయన వెలుగులను నింపుతున్నారని కొనియాడారు. ఇక కేసీఆర్ కు పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులను పెడుతున్నారు.

More Telugu News