SEC: బలవంతపు ఉపసంహరణలపై అభ్యర్థులు ఫిర్యాదు చేస్తే పరిగణనలోకి తీసుకోండి: రిటర్నింగ్ అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు

  • ఏపీలో మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు
  • బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలపై ఫిర్యాదులు స్వీకరించాలన్న ఎస్ఈసీ
  • మార్చి 2 లోగా వివరాలు పంపాలని సూచన
  • అసహజరీతిలో ఉపసంహరణ జరిగిందని తేలితే పునరుద్ధరిస్తామని వెల్లడి
SEC orders Returning Officers over nominations withdrawals in municipal elections

ఏపీలో మార్చి 10న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్లను బలవంతంగా వెనక్కి తీసుకునేలా చేశారంటూ అభ్యర్థులు చేసే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలంటూ రిటర్నింగ్ అధికారులకు ఎస్ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాంటి ఫిర్యాదులు వస్తే పరిశీలించాలని రిటర్నింగ్ అధికారులకు ఎస్ఈసీ స్పష్టం చేశారు. వాటిపై మార్చి 2వ తేదీ లోగా వివరాలు పంపాలని సూచించారు.

అసహజరీతిలో నామినేషన్లు ఉపసంహరించినట్టు అధికారులు గుర్తిస్తే ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలని వివరించారు. బలవంతపు ఉపసంహరణ జరిగిందని నిర్ధారణ అయితే, ఆ నామినేషన్లను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. నిమ్మగడ్డ తాజా ఆదేశాలతో... మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణల ఫిర్యాదుల అంశంపై స్పష్టత వచ్చినట్టయింది.

More Telugu News