YS Sharmila: షర్మిలకు మహిళలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది: కొండా రాఘవరెడ్డి

  • షర్మిల పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నాం
  • ఆమె రాజకీయాల్లోకి రావడాన్ని ఎందరో స్వాగతిస్తున్నారు
  • టీఆర్ఎస్ చేస్తున్నదాని కంటే మెరుగ్గా ముందుకు వెళ్తాం
All are welcome in to Sharmilas party says Konda Raghava Reddy

ఒక మహిళ రాజకీయ పార్టీని నడిపిన చరిత్ర ఇరు తెలుగు రాష్ట్రాల్లో లేదని కొండా రాఘవరెడ్డి అన్నారు. తొలిసారిగా దివంగత రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ప్రజల మధ్యకు వస్తున్నారని అన్నారు. షర్మిల రాజకీయాల్లోకి రావడాన్ని ఎంతోమంది స్వాగతిస్తున్నారని చెప్పారు. షర్మిలకు ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలో రాజన్న పాలన, ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ షర్మిల కొత్త పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఈరోజు హైదరాబాదులోని లోటస్ పాండ్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదానికంటే మెరుగైన పద్ధతిలో తాము ముందుకు వెళ్తామని అన్నారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు పార్టీకి సంబంధించి ఆత్మీయ సమ్మేళనాలు ఉంటాయని... ఆ తర్వాత అన్ని జిల్లాల నేతలతో సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. తమను విమర్శిస్తున్నవారికి తాము వేసే అడుగులే జవాబు చెపుతాయని అన్నారు. మరోవైపు తొలి రోజు షర్మిల మాట్లాడుతూ తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పిన సంగతి తెలిసిందే.

More Telugu News