Yuvaraj Singh: చిక్కుల్లో యువరాజ్ సింగ్... ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హర్యానా పోలీసులు!

  • గత సంవత్సరం లైవ్ షోలో పాల్గొన్న యువరాజ్
  • చాహల్ గురించి మాట్లాడుతూ వ్యాఖ్యలు
  • నిమ్న వర్గాలను కించ పరిచారని కేసు పెట్టిన న్యాయవాది
SC ST Act Case Against Cricketer Yuvaraj Singh

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తో పాటు, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద హర్యానా పోలీసులు కేసును రిజిస్టర్ చేయడంతో చిక్కుల్లో పడ్డాడు. ఓ లాయర్ ఇచ్చిన ఫిర్యాదులో హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసు స్టేషన్ ఉన్నతాధికారులు, విచారణ జరిపి, ప్రాథమిక సాక్ష్యాలున్నాయని నిర్ధారించుకుని కేసు నమోదు చేశారు. యువరాజ్ పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 153, 153 ఏ, 295, 505 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లోని 3 (1) (ఆర్), 3 (1) (ఎస్) కింద కేసు పెట్టినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే, గత సంవత్సరం జూన్ లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్ లో పాల్గొన్న యువరాజ్, మరో ఆటగాడైన యజువేంద్ర చాహల్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ సమయంలో ఓ సామాజిక వర్గం గురించి కొన్ని వ్యాఖ్యలు చేయగా, యువరాజ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆపై తన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చిన యువరాజ్, తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ, ట్విట్టర్ లో ఓ సందేశాన్ని ఉంచారు.

అయితే, యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని, నిమ్న కులాలను లక్ష్యం చేసుకుంటూ ఆయన మాట్లాడారని అంటూ, ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై లాక్ డౌన్ అనంతరం విచారణ జరిపి, వీడియో ఫుటేజ్ లను పరిశీలించిన హిస్సార్ పోలీసులు, కేసును నమోదు చేయడం గమనార్హం. త్వరలోనే యువరాజ్ కు నోటీసులు పంపి ఆయన్ను విచారిస్తామని ఓ అధికారి వెల్లడించారు.

More Telugu News