England: చెన్నై టెస్టులో ఇంగ్లండ్ 134 ఆలౌట్... భారత్ కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం

  • చెన్నైలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు
  • 5 వికెట్లతో సత్తాచాటిన అశ్విన్
  • భారత్ కు 195 పరుగుల ఆధిక్యం
  • ఇషాంత్, అక్షర్ లకు చెరో రెండు వికెట్లు
  • 42 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ఇంగ్లండ్ వికెట్ కీపర్
England all out in Chennai test

చెన్నైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోమారు ఈ సిరీస్ లో 5 వికెట్ల ప్రదర్శన కనబర్చిన వేళ ఇంగ్లండ్ జట్టు 134 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ 23.5 ఓవర్లలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం ఇవాళ్టి ఆటలో హైలైట్ గా నిలిచింది. కొత్త స్పిన్నర్ అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మకు కూడా 2 వికెట్లు దక్కాయి. సిరాజ్ ఓ వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితే అత్యధిక వ్యక్తిగత స్కోరు.

భీకర ఫామ్ లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 6 పరుగులకే అవుట్ కావడం ఆ జట్టు అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. భారత బౌలర్లు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ కు కుదురుకునే అవకాశమే ఇవ్వలేదు. క్రమం తిప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టు పనిబట్టారు. ఓలీ పోప్ 22 పరుగులు చేయగా, స్టోక్స్ 18 పరుగులు సాధించాడు.

టీమిండియాకు 195 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తన రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 150 పైచిలుకు పరుగులు చేస్తే ఇంగ్లండ్ ముందు కష్టసాధ్యమైన టార్గెట్ ఉంచే వీలుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ మ్యాచ్ జరుగుతున్న స్టేడియాన్ని డ్రోన్ తో చిత్రీకరించిన ఫొటోను పంచుకున్న ప్రధాని... మ్యాచ్ రసవత్తరంగా సాగుతోందంటూ వ్యాఖ్యానించారు. విహంగ వీక్షణం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాని ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఇవాళ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

More Telugu News