Uttarakhand: ఉత్తరాఖండ్​ ప్రమాదం: మరో మూడు మృతదేహాలు లభ్యం

  • తపోవన్ సొరంగం వద్ద కొనసాగతున్న సహాయ చర్యలు
  • 41కి చేరిన మొత్తం మృతుల సంఖ్య
  • వరద ముప్పును హెచ్చరించేందుకు వివిధ గ్రామాల్లో వ్యవస్థలు
  • శాటిలైట్ ఫోన్ల ద్వారా గ్రామస్థుల అప్రమత్తం
Three more bodies recovered at Tapovan tunnel toll rises to 41

ఉత్తరాఖండ్ ప్రమాదంలో మరో మూడు మృతదేహాలను అధికారులు గుర్తించారు. దీంతో మరణించిన వారి సంఖ్య 41 పెరిగింది. గత ఆదివారం మంచు చరియలు విరిగిపడి ధౌలిగంగా నది ఉప్పొంగింది. ఆ వరద ధాటికి పలు విద్యుత్ ప్రాజెక్టులు సహా బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. జోషిమఠ్ దగ్గరి తపోవన్ సొరంగంలో పలువురు చిక్కుకున్నారు. దీంతో వారం రోజులుగా వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు స్పందన దళం సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు.

అయితే, బురద ఎక్కువగా ఉండడంతో ఆదిలో ఆటంకాలు ఎదురయ్యాయి. చిన్నచిన్నగా తవ్వుకుంటూ లోపలికి వెళుతున్న సిబ్బందికి బురదలో కూరుకుపోయిన మృతదేహాలు కనిపిస్తున్నాయి. ‘‘ఆదివారం ఉదయం తపోవన్ ప్రధాన సొరంగం వద్ద బురదలో కూరుకుపోయిన రెండు మృతదేహాలను గుర్తించాం. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఉత్తరాఖండ్ పోలీసులు, రాష్ట్ర, జాతీయ విపత్తు స్పందన దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి’’ అని ఉత్తరాఖండ్ డీజీపీ ట్వీట్ చేశారు. తర్వాత మధ్యాహ్నం అదే ప్రాంతంలో మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాగా, రైని గ్రామానికి సమీపంలో రుషిగంగ వద్ద ఏర్పడిన కొత్త సరస్సును ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు స్పందన దళ సిబ్బంది, అధికారులు పరిశీలించారు. మరో ఉప్పెన వచ్చే ప్రమాదం ఉన్నందున స్థానికులను అప్రమత్తం చేశారు. ప్రమాదం గురించి హెచ్చరించేందుకు పాంగ్, తపోవన్, రైని గ్రామాల్లో హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. శాటిలైట్ ఫోన్ల ద్వారా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గ్రామస్థులకు వరద ప్రమాద హెచ్చరికలను ఇస్తారు.

More Telugu News