Farmers: రైతులు ఇంట్లోనే ఉండి చావొచ్చుగా... హర్యానా మంత్రి వ్యాఖ్యలతో కలకలం!

  • మరో మారు విమర్శలు ఎదుర్కొన్న దలాల్
  • ఢిల్లీ సరిహద్దుల్లో మరణించిన 200 మంది రైతులు
  • పాత అనారోగ్యంతోనే కన్నుమూశారన్న మంత్రి
  • రైతుల త్యాగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శలు
Haryana Minister Contravorcial Comments on Farmers

హర్యానాకు చెందిన వ్యవసాయ మంత్రి, బీజేపీ నేత జేపీ దలాల్ తన నోటి దురుసుతో మరోసారి విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. న్యూఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతుల్లో కొందరు మరణిస్తుండటాన్ని తాజాగా ప్రస్తావించిన ఆయన, రైతులు ఇంట్లోనే ఉండి చనిపోవచ్చుగా? అని వ్యాఖ్యానించారు. రోడ్లపైకి వచ్చి ఎందుకు చస్తున్నారని ప్రశ్నించారు. దలాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఆయనపై పలువురు మండిపడుతున్నారు.

తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతుండగా, ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలియజేస్తున్న రైతుల్లో 200 మందికి పైగా మరణించడాన్ని ప్రస్తావించిన ఓ విలేకరి స్పందించాలని కోరారు. దీనికి సమాధానం ఇచ్చిన దలాల్, "ఆ చచ్చే వాళ్లెవరో ఇంట్లోనే ఉండి చావొచ్చుగా? వారంతా ఇళ్లల్లోనే ఉండాల్సింది. అక్కడే చచ్చేవాళ్లు. రెండు లక్షల మంది నిరసనలకు వస్తే, గత ఆరు నెలల వ్యవధిలో 200 మంది అయినా మరణించరా?" అంటూ పెద్దగా నవ్వారు. చాలా మందికి గుండెపోటు వచ్చి మరణించారని, మరికొందరు అస్వస్థత బారిన పడి చనిపోయారని తెలిపిన ఆయన, వాళ్లందరూ వాళ్లకు ఉన్న పాత అనారోగ్య కారణాలతోనే మరణించారని అన్నారు.

కాగా, దాదాపు మూడు నెలలుగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లకు చెందిన లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇక దలాల్ స్టేట్ మెంట్, అందుకు సంబంధించిన వీడియో మీడియాలో ప్రసారం కాగానే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. రైతుల త్యాగాలను ఆయన అపహాస్యం చేశారని పలువురు విమర్శించారు.

దీంతో వివరణ ఇచ్చుకున్న దలాల్, తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని, తాను రైతుల సంక్షేమానికి కృషి చేసే వ్యక్తినని అన్నారు.

More Telugu News