DK Aruna: వైఎస్ షర్మిల రాజకీయ పార్టీపై డీకే అరుణ కామెంట్

  • తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు షర్మిల సిద్ధం!
  • షర్మిల వెనుక ఎవరున్నారో తెలుసంటూ అరుణ వ్యాఖ్యలు
  • తెలంగాణతో షర్మిలకు ఏం సంబంధం అన్న అరుణ
  • సీఎం కేసీఆర్ పైనా వ్యాఖ్యలు
  • ఈటల భయంతోనే సీఎం మార్పు ప్రచారానికి తెరదించారని ఆరోపణ
DK Aruna resppnds to YS Sharmila new political party

వైఎస్ షర్మిల తెలంగాణలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ మహిళానేత డీకే అరుణ స్పందించారు. వైఎస్ కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపిస్తుండడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని అరుణ అన్నారు. అసలు, తెలంగాణతో షర్మిలకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అటు, సీఎం కేసీఆర్ పైనా ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయాలని కలలు కంటున్న కేసీఆర్... మంత్రి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారన్న భయంతోనే సీఎం మార్పు అంశానికి తెరదించారని ఆరోపించారు.

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికపై స్పందిస్తూ, ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదని చెప్పిన టీఆర్ఎస్ ఇవాళ ఆ పార్టీ మద్దతుతో మేయర్ పీఠం చేజిక్కించుకుందని అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం బహిర్గతమైందని తెలిపారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ ఓడిపోతామన్న భయంతో కేసీఆర్ హామీల జల్లు కురిపిస్తున్నారని, ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ హామీలు ఇవ్వడం కేసీఆర్ కు పరిపాటిగా మారిందని విమర్శించారు.

More Telugu News