Nadendla Manohar: పెసర్లంకలో గెలిచిన వారిపై దాడి గర్హనీయం: నాదెండ్ల మనోహర్

  • పోలీసుల భాష గ్రామస్థుల మనోభావాలను దెబ్బతీసింది 
  • నిబంధనలు అందరికీ ఒకే రీతిన అమలు చేయాలి
  • సత్తెనపల్లిలో జనసేన జెండా దిమ్మెను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం
Nadendla Manohar condemns attack on Janasena winners

గుంటూరు జిల్లా పెసర్లంక గ్రామంలో జనసేన మద్దతుతో గెలిచిన వారిపై వైసీపీ శ్రేణులు, వారి ప్రోద్బలంతో పోలీసులు అనుసరిస్తున్న వైఖరి అప్రజాస్వామికంగా ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. గెలిచిన ఆనందంలో ఉన్న అభ్యర్థులు, వారి అనుచరులను నిబంధనల పేరుతో పోలీసులు అడ్డుకున్న తీరు, ఉపయోగించిన భాష గ్రామస్థుల మనోభావాలను దెబ్బతీశాయని చెప్పారు.

అన్ని పార్టీలకు నిబంధనలను ఒకే రీతిలో అమలు చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదని అన్నారు. కేవలం జనసేనకు, జనసేన మద్దతుదారులకు మాత్రమే నిబంధనలను వర్తింపజేస్తామంటే మాత్రం అభ్యంతరాలను వ్యక్తం చేస్తామని చెప్పారు.

ప్రజా క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సేవ చేయడం వల్లే జనసేనకు ఓటర్ల ఆదరణ దక్కిందని అన్నారు. సత్తెనపల్లిలో జనసేన పార్టీ జెండా ఉన్న దిమ్మెను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. దీనికి కారకులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

More Telugu News