Nara Lokesh: మంగళగిరిలో స్వర్ణకారుల సంక్షేమానికి రూ.5 లక్షల విరాళం ప్రకటించిన లోకేశ్

  • మంగళగిరిలో లోకేశ్ పర్యటన
  • స్వర్ణకారుల సంఘం వైద్యశిబిరానికి ప్రారంభోత్సవం
  • పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల విజయంపై వ్యాఖ్యలు
  • ఇది ప్రారంభం మాత్రమేనని వెల్లడి
  • మిగిలిన మూడు విడతల్లోనూ సత్తా చాటుతారని ధీమా
Lokesh announces donation for goldsmiths welfare in Mangalagiri

టీడీపీ ఎమ్మెల్యే నారా లోకేశ్ ఇవాళ మంగళిగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వర్ణకారుల సంఘం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. స్వర్ణకారుల సంక్షేమానికి లోకేశ్ రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ, పంచాయతీ ఎన్నికల అంశంపై మాట్లాడారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల విజయం చూసి అధికార పార్టీలో భయం మొదలైందని అన్నారు. బెదిరింపులను తట్టుకుని మరీ టీడీపీ మద్దతుదారులు 38 శాతం పంచాయతీలను కైవసం చేసుకున్నారని వివరించారు.

ఇది ప్రారంభం మాత్రమేనని, మిగతా మూడు విడతల్లోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పోరాడేందుకు వైసీపీ సిద్ధంగా లేదని, విజయసాయిరెడ్డిని విశాఖ ప్రజలు తరిమికొడతారని లోకేశ్ పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో టీడీపీ స్పష్టమైన వైఖరితో ఉందని వెల్లడించారు.

మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే ఈ అంశంపై దీక్ష ప్రారంభించారని, విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారని లోకేశ్ వివరించారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి భారీ ఉద్యమం చేపడుతున్నామని స్పష్టం చేశారు.

More Telugu News