Cricket: ఏంటిది కోహ్లీ?... దారుణ ఓటమి తరువాత నెట్టింట అభిమానుల ఆగ్రహం!

  • ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఓటమి
  • వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో సారధిగా విఫలమైన కోహ్లీ
  • ఇకనైనా విజయాల బాటన నడవండి
  • సామాజిక మాధ్యమాల్లో అభిమానుల పోస్టులు
Fans Angry on Virat Kohli

ఆసీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తరువాత, అత్యధిక గెలుపు శాతాన్ని కలిగివున్న విరాట్ కోహ్లీ, ఇప్పుడు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. తన కెప్టెన్సీలో వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోవడం, టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలన్న ఆశలు సంక్లిష్టం కావడంతో, సోషల్ మీడియాలో కోహ్లీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టులు, ఆసీస్ పర్యటనలో అడిలైడ్ వేదికగా సాగిన టెస్ట్ లో ఓటమి తరువాత కోహ్లీ ఇండియాకు వచ్చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ జట్టును వీడిన తరువాత, భారత జట్టు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించి, ఆసీస్ తో సిరీస్ ను నెగ్గడం ద్వారా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని మరోమారు సాధించింది. ఆపై టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానానికి చేరుకుంది.

ఇక, ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రాగా, రెండు జట్లు ఆడనున్న నాలుగు మ్యాచ్ ల తరువాత కనీసం 2-1 తేడాతో భారత్ విజయం సాధిస్తే, టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలుంటాయి. ఇప్పటికే ఓ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించగా, మిగతా మూడు మ్యాచ్ లూ భారత జట్టుకు అత్యంత కీలకం. కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు వరుస ఓటములను జీర్ణించుకోలేక పోతున్న క్రికెట్ అభిమానులు ఇకనైనా జట్టును విజయాల బాట పట్టించాలని కోరుతున్నారు.

కాగా, 2014లో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత, కోహ్లీ 57 మ్యాచ్ లకు సారధిగా వ్యవహరించగా, 33 విజయాలు, 14 పరాజయాలు, 10 డ్రాలు ఉన్నాయి. రికీ పాంటింగ్ 62.33 శాతం విజయాలతో ఉండగా, కోహ్లీ 57.89 శాతంతో రెండో స్థానంలో ఉన్నాడు.

More Telugu News