Deep Siddhu: ఎర్రకోటపై దాడి కేసులో... ఎట్టకేలకు దీప్ సిద్ధూ అరెస్ట్!

  • ఇటీవల లక్ష రూపాయల రివార్డు ప్రకటించిన పోలీసులు
  • ఈ ఉదయం ఢిల్లీలో అరెస్ట్ చేసిన స్పెషల్ పోలీసులు
  • రహస్య ప్రదేశంలో విచారణ
Punjabi Actor Deep Siddhu Arrested

గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై సిక్కు నిరసనకారులు చేసిన దాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ స్పెషల్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆపై దీప్ సిద్ధూ ఆచూకీ తెలిపితే రూ. 1 లక్ష రివార్డును ఇస్తామని కూడా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో నేటి ఉదయం న్యూఢిల్లీలో దీప్ సిద్ధూ ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు, ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను ఓ రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఎర్రకోటపై సిక్కు పతాకాలను ఎగురవేసిన కేసులో దీప్ సిద్ధూతో పాటు జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జంత్ సింగ్ లను పోలీసులు నిందితులుగా చూపిన సంగతి తెలిసిందే. వీరితో పాటు జజ్బీర్ సింగ్, బూటా సింగ్, సుఖదేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ ల పేర్లనూ పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో జోడించారు.

More Telugu News