Farm Laws: వ్యవసాయాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్​: కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్​ మండిపాటు

  • ప్రతిపక్షాలు, రైతు సంఘాలు సాగు చట్టాల్లో ఒక్క లోపాన్నీ ఎత్తి చూపలేకపోయాయి 
  • సవరణలు చేసినంత మాత్రాన చట్టాల్లో లోపాలున్నట్టు కాదు
  • రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారు
  • భూములు లాక్కుంటారని చట్టాల్లో ఎక్కడుంది?
  • రాజ్యసభలో ప్రతిపక్షాలపై మంత్రి ఆగ్రహం
Congress does khoon ki kheti Minister Narendra Tomar attacks Opposition in Rajya Sabha

సాగు చట్టాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మండిపడ్డారు. ఇటు ప్రతిపక్షాలు, అటు రైతు సంఘాలు.. సాగు చట్టాల్లో ఒక్క లోపాన్నీ ఎత్తి చూపలేకపోయాయని అన్నారు. శుక్రవారం రాజ్యసభలో వ్యవసాయ చట్టాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ‘‘వ్యవసాయానికి నీళ్లు కావాలని ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, ఆ వ్యవసాయాన్ని కాంగ్రెస్ నాశనం చేసింది. బీజేపీ ఎప్పుడూ అలా చేయదు’’ అని మండిపడ్డారు. సాగు చట్టాలను సమర్థించారు.

ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సదా సిద్ధంగానే ఉందని అన్నారు. చట్టాల్లో సవరణలు చేసేందుకూ సిద్ధమేనని, అలాగని ఆ మూడు చట్టాల్లో లోపాలున్నట్టు కాదని ఆయన తేల్చి చెప్పారు. కేవలం ఒక రాష్ట్రానికి చెందిన రైతులే ఆందోళనలు చేస్తున్నారని, వారికి కావాలనే తప్పుడు సమాచారమిచ్చి రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేట్లు రైతుల భూములను లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఒప్పంద వ్యవసాయంలో రైతు భూమిని లాక్కునేలా చట్టంలో ఎక్కడైనా నిబంధనలున్నాయేమో చూపించాలని సవాల్ విసిరారు. చట్టాలతో రైతులకు లాభం తప్ప ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. రైతుల బాగు కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. కొత్త చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు.

More Telugu News