YSRCP: ఢిల్లీలో చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైసీపీ ఎంపీలు

  • ఢిల్లీ పార్లమెంటు సమావేశాలు
  • పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఎంపీలు
  • బీజేపీ పంచన చేరేందుకు బాబు తహతహలాడుతున్నాడన్న బాలశౌరి
  • ఆలయాలపై దాడులు టీడీపీ పనే అంటూ బోస్ వ్యాఖ్యలు
  • టీడీపీని బహిష్కరించాలన్న మార్గాని భరత్
YCP MPs slams Chandrababu

ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు గతంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో డబ్బులు పంచారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆరోపించారు. ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకునేందుకు తన ఎంపీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు పంపారని విమర్శించారు.

మోదీ కుటుంబం గురించి చెడుగా మాట్లాడి, అమిత్ షాపై రాళ్లు వేయించిన ఘనత చంద్రబాబుదని, ఇప్పుడు కేసుల భయంతో కాళ్ల బేరానికి వచ్చారని, బీజేపీ పంచన చేరేందుకు తహతహలాడుతున్నారని ఆరోపించారు. తాము కూడా కేంద్రం పెద్దలను కలిసి చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని కోరతామని అన్నారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, ఆలయాలపై దాడులు టీడీపీ నేతల పనే అని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. పైగా టెక్కలి విగ్రహ ధ్వంసం ఘటనలో టీడీపీ నేతల నిర్వాకం వీడియోలో రికార్డయిందని వెల్లడించారు. తాజాగా అధికారులను చంద్రబాబు ఎంతగా ప్రలోభపెట్టాలని చూసినా స్థానిక ఎన్నికల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ మార్గాని భరత్ స్పందిస్తూ ప్యాకేజీల కోసం చంద్రబాబు ఏపీని నాశనం చేశారని, చంద్రబాబు పార్టీని ఏపీ ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

More Telugu News