Parliament: రైతుల వ‌ద్ద‌కు విప‌క్ష ఎంపీల బృందం.. మేకులు తొల‌గిస్తోన్న రైతులు.. ఉద్రిక్త‌త‌

  • గాజీపూర్ స‌రిహ‌ద్దుకు విప‌క్ష ఎంపీల బృందం
  • రైతుల ఆందోళ‌న‌కు సంఘీభావం
  • 10 పార్టీల‌కు చెందిన 15 మంది ఎంపీలు  
  • ఎంపీల‌ను స‌రిహ‌ద్దులోనే నిలిపేసిన పోలీసులు  
opposition mps reaches ghajipur

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల వ‌ద్ద నిర‌స‌న‌లు కొన‌సాగిస్తోన్న రైతుల‌కు సంఘీభావం తెలిపేందుకు గాజీపూర్ స‌రిహ‌ద్దు వ‌ద్ద‌కు విప‌క్ష ఎంపీల బృందం చేరుకుంది. రైతుల ఆందోళ‌న‌ల గురించి వారితో మాట్లాడ‌తామ‌ని తెలిపింది.

దేశంలోని 10 పార్టీల‌కు చెందిన 15 మంది ఎంపీలు ఈ బృందంలో ఉన్నారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ క‌నిమొళి, ఎంపీలు సౌర‌త్ రాయ్, హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ బాద‌ల్ వీరిలో ఉన్నారు. అయితే, ఎంపీల‌ను స‌రిహ‌ద్దులోనే పోలీసులు నిలిపి వేసి, గాజీపూర్ దాటి వెళ్లేందుకు వారికి అనుమ‌తి లేదని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా హ‌ర్‌సిమ్ర‌త్ స్పందిస్తూ... రైతుల ఆందోళ‌న‌ల‌పై లోక్‌స‌భ‌లో మాట్లాడేందుకు స్పీక‌ర్ కూడా అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని చెప్పారు. స‌రిహ‌ద్దుల్లో రైతులు ఆందోళ‌న చేస్తోన్న నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితుల‌ను తెలుసుకునేందుకే తాము ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్లు వివ‌రించారు.

తాము రైతుల‌తో మాట్లాడి తీరుతామ‌ని చెప్పారు. మ‌రోవైపు, రైతులు బ‌యట‌కు రాకుండా, ఇత‌రులు లోప‌లికి వెళ్ల‌కుండా రైతుల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల వ‌ద్ద పోలీసులు బారికేడ్ల ముందు ఏర్పాటు చేసిన మేకుల‌ను రైతులు తొల‌గించారు. దీంతో ఉద్రిక్త‌త నెల‌కొంది.

More Telugu News