Banks: రకరకాల ఛార్జీలతో వినియోగదారులను బాదుతున్న బ్యాంకులు!

  • డబ్బులు వేసినా, తీసినా ఛార్జీలు వేస్తున్నారు
  • కరోనా వల్ల నగదు నిర్వహణ భారం పెరిగిందంటున్న బ్యాంకులు
  • డిపాజిట్లు 2 లక్షలు దాటితే బాదుడే
Banks collecting various charges from customers

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న జనాలకు బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతి దానికి ఏదో ఒక ఛార్జ్ వసూలు చేస్తూ వినియోగదారుడి వీపు విమానం మోత మోగిస్తున్నాయి. దేనికి ఏ ఛార్జీ వసూలు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో బ్యాంకు వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

ఇటీవలి కాలంలో బ్యాంకులు ఎడాపెడా బాదేస్తున్నాయి. డబ్బులు వేసినా, తీసినా బాదుడే ఉంటోంది. కరోనా నేపథ్యంలో నగదు నిర్వహణ భారం పెరిగిందనే సాకు చూపి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. గత నవంబర్ 1 నుంచే కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ పద్ధతులను పాటిస్తున్నాయి.

గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నెలకు ఐదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే వీలుండేది. ఇప్పుడు వాటిని మూడింటికి తగ్గించారు. పొదుపు ఖాతాలపై ప్రస్తుతం 2 శాతం వడ్డీ లభిస్తోంది. ఫిక్సుడు డిపాజిట్లపై స్వల్ప కాలానికి 3 శాతానికి మించి రావడం లేదు.

ఇదే సమయంలో నగదు డిపాజిట్లపై వేస్తున్న ఛార్జీలు అంతకు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. రూ. 2 లక్షల పరిమితి మించితే ప్రతి వెయ్యికి రూ. 2 చొప్పున ప్రభుత్వ బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకులు రూ. 2 నుంచి 5 వరకు వసూలు చేస్తున్నాయి. ఏటీఎం, నేరుగా ఉపసంహరణలు, నగదు డిపాజిట్లు రూ. 2 లక్షలు దాటితే ఛార్జీలు వేస్తున్నారు. బ్యాంకుల బాదుడుపై వినియోగదారులు మండిపడుతున్నారు.

More Telugu News