Vijayasai Reddy: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగింది: విజయసాయిరెడ్డి

  • కేంద్ర బడ్జెట్ మమ్మల్ని నిరాశ పరిచింది
  • ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించింది
  • పోలవరం ప్రాజెక్టును బడ్జెట్ లో ప్రస్తావించలేదు
No allocations for AP in Union Budget says Vijayasai Reddy

కేంద్ర బడ్జెట్ ను ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బడ్జెట్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పెదవి విరిచారు. బడ్జెట్ లో ఏపీపై సవతి ప్రేమను ప్రదర్శించారని మండిపడ్డారు. ఈ బడ్జెట్ తమను ఎంతో నిరాశ పరిచిందని చెప్పారు. ఇది పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు బడ్జెట్ అని... ఎన్నికలు జరిగే రాష్ట్రాల బడ్జెట్ అని చెప్పారు. అన్ని విషయాల్లో ఏపీకి మొండి చేయి చూపించారని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలపై బడ్జెట్ లో ప్రస్తావించలేదని విజయసాయి దుయ్యబట్టారు. విశాఖ మెట్రో ప్రాజెక్టుపై మాట్లాడలేదని అన్నారు. విజయవాడ-ఖరగ్ పూర్ రవాణా కారిడార్ వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో కిసాన్ రైళ్లను వేయాలని కోరినా పట్టించుకోలేదని, ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. ధాన్యం బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రానికి ఒక్క ఫిషింగ్ హార్బర్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. ఏపీలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ వైరాలజీ సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు.

More Telugu News