New Delhi: ఎంబసీ వద్ద దాడి ఆశ్చర్యం కలిగించలేదు.. ముందే ఊహించాం: భారత్​ లో ఇజ్రాయెల్​ రాయబారి

  • ప్రపంచంలోని తమ ఎంబసీలకన్నిటికీ ముప్పేనన్న రోన్ మల్కా
  • అన్నింటి వద్దా హై అలర్ట్ విధించామని వెల్లడి
  • శుక్రవారం ఢిల్లీలోని ఎంబసీ 29వ వార్షికోత్సవం
  • ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని వ్యాఖ్య
  • భారత్ తో కలిసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడి
Many Israeli missions under attack Delhi blast not surprising says Israel ambassador

ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీపై దాడి ఆశ్చర్యానికి ఏమీ గురిచేయలేదని భారత్ లో ఇజ్రాయెల్ రాయబారి రోన్ మల్కా అన్నారు. దేశంతో పాటు ప్రపంచంలోని అన్ని ఇజ్రాయెల్ ఎంబసీలనూ లక్ష్యం చేసుకున్నారని చెప్పారు. శుక్రవారం నాటి దాడిపై భారత్ తో కలిసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనన్నారు.

ఎంబసీలోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని ఎంబసీ 29వ వార్షికోత్సవమని, కాబట్టి ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసిందే అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.  

బాంబు దాడి చేసిందెవరో తేల్చే పనిలో పడ్డామని ఆయన అన్నారు. ఫలానా వారు చేశారని ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇటు యూరప్ లోని ఎంబసీలపైనా దాడులు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇజ్రాయెల్ ఎంబసీల వద్ద హై అలర్ట్ విధించామన్నారు. రియల్ టైం ఇంటెలిజెన్స్ ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో ఉన్నామన్నారు.

దౌత్యవేత్తలు, ఎంబసీకి సరైన భద్రత కల్పించేందుకు భారత్ హామీ ఇచ్చిందన్నారు. ‘‘ఇజ్రాయెల్ ఎంబసీలు, హై కమిషన్లకు ఎప్పుడూ ముప్పే. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఏదో ఒక ఎంబసీ వద్ద ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి జరుగుతుందని ముందే ఊహించాం. అందుకే గత వారం రోజులుగా హై అలర్ట్ లోనే ఉన్నాం’’ అని చెప్పారు.

More Telugu News