Parliament: పార్లమెంటు క్యాంటీన్‌లో భారీగా పెరిగిన హైద‌రాబాద్ బిర్యానీ రేటు!

  • పార్లమెంటు క్యాంటీన్‌లో  ఆహారంపై  ఇచ్చే సబ్సిడీ ఎత్తివేత‌
  • రేప‌టి నుంచి అమ‌లు
  • ఇప్ప‌టివ‌ర‌కు హైద‌రాబాద్ మ‌ట‌న్ బిర్యానీ రూ.65
  • రేప‌టి నుంచి రూ.150  
hyderabad biryani rate hike in parliament

పార్లమెంటు క్యాంటీన్‌లో ఎంపీలకు ఆహారంపై ఇచ్చే సబ్సిడీ  తొలగిస్తున్నట్లు ఇటీవ‌లే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో క్యాంటీన్‌లో లభించే ఆహారం ఇక‌పై నిర్ణీత ధరల‌కు లభించ‌నుంది.

ఎంపీలకు ఈ పార్ల‌మెంటు స‌మావేశాల నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయి. కొత్త ధ‌ర‌లతో మెనూ ఏర్పాటు చేశారు. వీటి ప్రకారం, ఇక‌పై నాన్ వెజ్ బ‌ఫే కోసం ఎంపీలు రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. వారి మెనూలో ఉన్న ఆహార ప‌దార్థాల్లో అత్య‌ధిక ధ‌ర ఉన్న ఆహారం ఇదే.  

పార్ల‌మెంట్ క్యాంటీన్‌లో ఇప్ప‌‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ మ‌ట‌న్ బిర్యానీ రూ.65కే ఎంపీల‌కు ల‌భించేది. ఇక‌పై వారు దీన్ని తినాలంటే  రూ.150 చెల్లించాలి. శాకాహార భోజనానికి రూ.100, ఉడ‌క‌బెట్టిన కూర‌గాయ‌లను రూ.50కి అందించ‌నున్నారు.

పార్ల‌మెంటులో స‌బ్సిడీని ఎత్తేయ‌డం వ‌ల్ల లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్‌కు ఏడాదికి రూ.8 కోట్లు మిగ‌ల‌నున్నాయి. రేప‌టి నుంచే ఈ ధ‌ర‌లు అమ‌ల్లోకి రానున్నాయి. వ‌చ్చేనెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్ట‌నున్నారు.

More Telugu News