Farm Laws: ఢిల్లీలోకి చొచ్చుకెళ్లిన రైతులు.. అనుకున్న సమయానికి ముందే ట్రాక్టర్ ర్యాలీ

  • గణతంత్ర దినోత్సవ కవాతు తర్వాత చేయాలన్న పోలీసులు
  • వినిపించుకోకుండా బారికేడ్లను తోసేసుకుని వెళ్లిన రైతులు
  • సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో బాష్ప వాయువు ప్రయోగించిన పోలీసులు
  • ఫిబ్రవరి 1న పార్లమెంట్ వరకు పాదయాత్ర చేస్తామంటున్న రైతులు
Police use tear gas to disperse protesters at Sanjay Gandhi Transport Nagar

సాగు చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేసుకుని మరీ రైతులు సరిహద్దుల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించారు. సింఘు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల నుంచి ట్రాక్టర్లతో బయల్దేరిన రైతులు.. అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి వచ్చారు.

ముందుగా నిర్ణయించినట్టే రాజ్ పథ్ లో నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ కవాతు పూర్తయ్యాక ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాల్సిందిగా పోలీసులు కోరినా.. రైతులు వినిపించుకోలేదు. చెప్పిన సమయానికన్నా ముందే మొదలు పెట్టారు. ర్యాలీలో పాల్గొన్న కొందరు నేతలు విప్లవ గీతాలు పాడారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు. సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో ర్యాలీ కొంచెం హింసాత్మకంగా మారింది. దాంతో రైతులపై పోలీసులు బాష్ప వాయువు గోళాలను ప్రయోగించారు. కొందరు రైతులు పోలీసుల వాటర్ కెనాన్లపైకి ఎక్కారు.  

‘‘ఒప్పందం ప్రకారం రైతులు రిపబ్లిక్ డే కవాతు తర్వాతే  ట్రాక్టర్ ర్యాలీని చేపట్టాల్సి ఉంది. కానీ, ముందే ర్యాలీని ప్రారంభించారు. బలవంతంగా ఢిల్లీలోకి ప్రవేశించారు. ముందుగా నిర్ణయించినట్టు బవానా వైపు వెళ్లాల్సిందిగా రైతులను కోరినా వినిపించుకోవట్లేదు. ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తామని పట్టుబట్టి కూర్చున్నారు’’ అని ఓ పోలీస్ అధికారి చెప్పారు.

కాగా, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన రైతులే బారికేడ్లను దాటుకుని ఢిల్లీలోకి ప్రవేశించారని ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న సంక్యుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది. కాగా, బడ్జెట్ సమావేశాలు జరిగే ఫిబ్రవరి 1న పార్లమెంట్ దాకా పాదయాత్ర కూడా చేస్తామని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.

More Telugu News