Jagan: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వైసీపీ ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం

  • ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
  • ఎంపీలతో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమావేశం
  • సమావేశాల సన్నద్ధతపై సమీక్ష
  • పోలవరం, ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడాలని సూచన
CM Jagan held meeting with MPs ahead of Parliament Budget Session

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ వైసీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

 ముఖ్యంగా, పోలవరం అంశాన్ని గట్టిగా వినిపించాలని, సవరించిన అంచనాలు, వాటి ఆమోదానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.55,656 కోట్లకు ఆమోదం అందాల్సి ఉందని, ఇంకా 1,569 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. అంచనా వ్యయం ఖరారు చేయాలన్న అంశంలో కేంద్ర జలశక్తిపై ఒత్తిడి తెస్తున్నామని... ఎంపీలు కూడా పార్లమెంటులో దీనిపై కృషి చేయాలని చెప్పారు.

అటు, ప్రత్యేక హోదా అంశాన్ని కూడా లేవనెత్తాలని సూచించారు. హోదా కోసం అనేక పర్యాయాలు లేఖలు రాశామని, ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని ఎంపీలకు వివరించారు. పార్లమెంటు వేదికగా దీనిపై ఏపీ ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని వారికి సూచించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని బీజేపీ తన మేనిఫెస్టోలో  పేర్కొందని, ఈ అంశంలో కేంద్రాన్ని రీనోటిఫికేషన్ గురించి ప్రశ్నించాలని తెలిపారు.

కేంద్రం విశాఖ రైల్వే జోన్ ప్రకటించినా, డివిజన్ల సమస్యలు ఉన్నాయని, వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. అంతేకాకుండా, కేంద్రం ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న అబార్షన్ బిల్లు, వ్యవసాయ చట్టాలపై చర్చ తదితర అంశాలపై ఎంపీలు అవగాహన పెంచుకోవాలని సీఎం జగన్ సూచించారు. ముఖ్యంగా, ఏపీలో జరుగుతున్న ఆలయాలపై దాడి ఘటనల పట్ల ఎంపీలు పూర్తి వివరాలతో సన్నద్ధంగా ఉండాలని ఉద్బోధించారు.

More Telugu News