Nara Lokesh: టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్రకు నిన్న ఇచ్చిన అనుమతి ఇవాళ ఎందుకు రద్దయింది?: నారా లోకేశ్

  • తిరుపతి పార్లమెంటు స్థానం పరిధిలో ధర్మ పరిరక్షణ యాత్ర
  • అలిపిరి వద్ద టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్
  • సీఎంకు ఎందుకంత అసహనం అంటూ ట్వీట్
  • టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్ర ఆగదని స్పష్టీకరణ
Nara Lokesh questions CM Jagan over Dharma Parirakshana Yatra permission cancellation

తిరుపతి పార్లమెంటు స్థానం పరిధిలోని గ్రామాల్లో టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, తిరుపతిలోని అలిపిరి నుంచి ప్రారంభమైన ఈ యాత్రను పోలీసులు అడ్డుకోవడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మ పరిరక్షణ యాత్రకు నిన్న ఇచ్చిన అనుమతి ఈ రోజు ఎందుకు రద్దయిందంటూ లోకేశ్ నిలదీశారు.

దేవాలయాలపై దాడులు, దళితులపై దమనకాండ, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ చేపడుతున్న ధర్మ పరిరక్షణ యాత్రకు జగన్ రెడ్డి ఎందుకు మతం రంగు పూస్తున్నారని ప్రశ్నించారు. ధర్మాన్ని కాపాడమంటే క్రిస్టియన్ సీఎంకు ఎందుకంత కోపం? రాష్ట్రంలోని అన్ని మతాల వారిని సమానంగా చూడమంటే ఎందుకంత అసహనం? అంటూ లోకేశ్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.

ధర్మాన్ని కాపాడమని అడిగినందుకు టీడీపీ నేతలను అక్రమంగా నిర్బంధించడాన్ని, కార్యకర్తలపై లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా ధర్మ పరిరక్షణ కోసం టీడీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

More Telugu News