KCR: కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి: ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

  • 99 శాతం పనులకు కేటీఆరే హాజరవుతున్నారు
  • పలు కార్యక్రమాలకు కేసీఆర్ బదులు కేటీఆర్ విచ్చేస్తున్నారు  
  • కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది?
KTR may become Telangana CM says Etela Rajenderr

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా కేటీఆర్ త్వరలోనే బాధ్యతలను స్వీకరించబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ దిశగా ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హింట్ కూడా ఇచ్చారు. తన కుమారుడికి పగ్గాలను అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగాన్ని సిద్దం చేశారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశానికి సంబంధించి మరింత స్పష్టతను ఇచ్చాయి. కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతున్న సందర్భంగా ఈటలకు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేసీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించగా... 99 శాతం పనులకు కేటీఆరే హాజరవుతున్నారని... పలు కార్యక్రమాలకు కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరవుతున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరయ్యారని... దీనిపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని... ఇందులో తప్పేముందని ఈటల ప్రశ్నించారు. మంత్రిగా తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొంత కాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయనే ప్రశ్నకు బదులుగా ఆయన ఈమేరకు సమాధానం ఇచ్చారు.

More Telugu News